– ఖమ్మం,సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం
– గండ్లు పడిన చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు
– కోదాడ,హుజుర్నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన
– భారీ వర్షాలతో గండ్లు పడిన సాగర్ ఎడమ కాలువకు జరుగుతున్న మరమ్మతుల పరిశీలన
కోదాడ: ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ విపత్తుకు రాష్ట్రానికి జరిగిన నష్టం 10,300 కోట్లు. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరినాము. జరిగిన నష్టం వివరాలను కేంద్రానికి నివేదించినాం. కేంద్రం సహాయం కోసం ఎదురు చూడకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టినాం.
విపత్తు సంభవించిన రోజు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో సహా అందరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భారీ నుండి అతి భారీగా కురిసిన వర్షాలతో ఖమ్మం,సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్ ప్రాంతాలలో భారీ నష్టం సంభవించింది.
కాగిత రామచంద్రాపురం వద్ద గండి పడిన సాగర్ ఎడమకాలువాను నెల రోజుల్లో పునరుద్దరిస్తాం. రేయింబవళ్లు పని చేసేందుకు ఏజెన్సీ ముందుకు వచ్చింది. ఇది అత్యయక పరిస్థితిగా గుర్తించినందుకే పనులు వేగవంతం చేస్తున్నాం. రాత్రుళ్ళు పనులకు ఆటంకం ఏర్పడకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశాం. సంఘటన జరిగాక ఇక్కడికి నేను రావడం ఇది రెండోసారి. వారంలోపు ఈ కాలువ లో నీళ్లు పారుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పని చేస్తుంది.
రైతాంగం నష్టపోకూడదు అన్నదే ప్రభుత్వ సంకల్పం. పంట నష్టం జరగకూడదన్న భావం తోటే స్వయంగా పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల చెరువులు కాలువలకు గండ్లు. కొన్ని చోట్ల పంప్ హౌజ్ లు ముంపునకు గురయ్యాయి. గండ్లు పడిన చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తాం. హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలో బురుగ్గడ్డ నల్లచెరువు,చౌటపల్లి చెరువు,నాగులచెరువు లతో పాటు కోదాడ నియోజకవర్గంలోని నారాయణ పురం చెరువులను పునరిద్దరిస్తాం.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆర్లగూడెం గ్రామములోని రెడ్లకుంట మేజర్,హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ముక్త్యాల బ్రాంచ్ మేజర్ కెనాల్ ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తాం. వరదలతో నష్టపోయిన పంటలకు తగిన పరిహారం. ఇళ్లు కూలిపోయిన వారికీ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తాం. వరదల్లో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం మంజూరు చేస్తాం.