సహాయక చర్యల్లో 1,800 మంది టీడీపీ శ్రేణులు నిమగ్నం

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి

విజయవాడ, మహానాడు: విజయవాడలో నెలకొన్న విపత్కర పరిస్థితి దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు 1,800 మందికి పైగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు విజయవాడలోని వేర్వేరు చోట్ల సహాయ కార్యక్రమాలను అప్పగించామని, చంద్రబాబు నిరంతరం ఇస్తున్న ఆదేశాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఎక్కడ సమస్య ఎదురవుతుంటే అక్కడ వారికి అందుబాటులో ఉండేందుకు వీరంతా పనిచేస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఈ కార్యకర్తలకు వివిధ సహాయ కార్యక్రమాలను అప్పగించామని చెప్పారు.

36 వార్డులు, మండలాల్లో 1761 మంది కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. 9 మ్యాప్డ్ వలంటీర్ల బృందాలు, 409 మంది కార్యకర్తలతో పనిచేస్తున్నాయన్నారు. 36 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నేతృత్వంలో 1112 మంది.. 36 బృందాలుగా క్షేత్రస్థాయి సహాయ కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్నారని చెప్పారు. 11 మంది మంత్రుల నేత్రత్వంలో 240 మంది కార్యకర్తలు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారని వివరించారు. వీరంతా లోకేష్ ఇస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సహాయం… ఇంకా అందాల్సిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టేటట్టుగా చేస్తున్నామని చెప్పారు.

ఈ బృందాలు చాలా కష్టతరమైన పరిస్థితుల్లోనే చాలా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి మరీ వారికి ప్రభుత్వ సహాయం అందేటట్టుగా సేవలు చేస్తున్నారని చెప్పారు. ఇది వరుసగా మూడో రోజు కొనసాగుతున్న విషయాన్ని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు విద్యుత్తు పునరుద్ధరణకు నోచుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా వాటికి అన్ని రకాల పరిస్థితులను గమనించాక విద్యుత్ సరఫరాలకు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ చాలామందికి మూడు పూటలా భోజనం, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నారని చెప్పారు. దాదాపు 150 మందికి పైగా గర్భిణులను ప్రత్యేకించి ఆస్పత్రికి తరలించి వారికి వైద్య సాయం అందుబాటులో ఉండేట్టుగా చూస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఈ విధులు నిర్వర్తిస్తున్న కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా గుర్తుంచుకొని అధినాయకత్వానికి వారి చొరవను తెలియజేస్తుందని శ్రీనివాస్ తెలిపారు.