-దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి
-డిబిటి ద్వారా బదిలీ
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు (పార్వతీపురం మన్యం) : జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. దీపం-2 పథకం క్రింద ౩ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. దీపం పథకంను శుక్రవారం సాలూరు పట్టణంలో మంత్రి ప్రారంభించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులు అయిన పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందజేయుటకు అక్టోబర్ 31 నుండి శ్రీకారం చట్టిందని చెప్పారు. జిల్లాలో 1,97,727 మంది దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ పధకం పొందుటకు ఆధార్ కార్డు నెంబరు, రేషన్ / బియ్యం కార్డు నెంబరు, ఆధార్ నెంబరుతో లింకు చేసిన బ్యాంకు ఖాతా (ఎకౌంటు) నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉంటే సరిపోతుందని ఆమె వివరించారు. లబ్దిదారులు తమ వివరాలు లేకపోతే ఆయా సంస్థలు, శాఖల నుండి వివరాలు పొంది నమోదు చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని ఆమె వివరించారు.