2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

– యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైతే రూ. లక్ష ప్రోత్సాహం
– సివిల్స్ కు ఎంపికైతే రాష్ట్రానికి ప్రయోజనం

హైదరాబాద్‌, మహానాడు: ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. హైదరాబాదులోని అశోక్ నగర్ లో గురువారం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి, ప్రసంగించారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు . ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూప్ -1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలవారు ఆర్థిక ఇబ్బందులతో యూపీఎస్సీ పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి మెయిన్స్ కు ఎంపికైన వారికి ఇంధన శాఖ పక్షాన ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా అందించినట్టు తెలిపారు. మెయిన్స్ కు అర్హత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయలు ప్రోత్సాహంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వివరించారు. సివిల్ సర్వీస్ కు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఎంపిక అయితే మన ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే పెద్ద సంఖ్యలో సివిల్స్ కోచింగ్ అకాడమీలు రావలసిన అవసరం ఉందన్నారు.