వైసీపీ నేతల భూదందాపై సీబీఐ విచారణ చేపట్టాలి
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణాలు జరిగాయని, అసైన్డ్ భూముల అమ్మకాలకు వీలు కల్పిస్తున్నట్లు పలు జీవోలు తెచ్చి గద్దల్లా నిరుపేదల భూములను కారు చౌకగా కొట్టేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. 2003కు ముందు ఇచ్చిన దాదాపు 25 లక్షల ఎకరాల కు పైగా అసైన్డ్ భూములను పేదల నుంచి లాగేశారన్నారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఏపీ అసైన్డ్ భూముల కుంభకోణమేనని తెలిపారు.
వ్యవసాయ యోగ్యం కాని, పట్టణాలకు చెరువులో ఉన్న భూములపై పెత్తందారులంతా గద్దల్లా వాలారని, ఇందులో అధికార పార్టీ నాయకులతో పాటు అధికార యంత్రాంగం కూడా తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా వ్యవహరించిందని చెప్పారు. ఉత్తరాంధ్రలో 596 జీవోను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి బంధువర్గం రూ.2 వేల వేల కోట్ల విలువైన 800 ఎకరాల దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నట్లు చెప్పారు. వైకాపా భూముల కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అమరావతిలో అసైన్డ్ భూముల కంభకోణం జరిగిందంటూ జగన్ పదేపదే ప్రచా రం చేసినట్టు చెప్పారు. రానున్న చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఏపీలో జరిగిన అసైన్డ్ భూముల భూ బాగోతంపై సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.