– తక్కువ ప్రభావం ఉంటే రూ.2 కోట్లు
– తక్షణం విడుదలకు సీఎం ఆదేశం
– భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వండి
– సహాయక చర్యల్లో అలసత్వం వద్దు
– సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డిఎస్పీలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రటించారు. ఆదివారం కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని కోరారు. శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య శనివారం రాత్రి తుపాను తీరం దాటుతుందని అంచనా ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు.
రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామన్న సీఎం అన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని, ఇప్పుడు తుపాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది…. ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కాదు…. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని చంద్రబాబు కోరారు. హుద్ హుద్ తుపాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను పాటించాలని అధికారులకు సూచించారు.
టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు
• వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
• కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది.. ఆదివారం కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
• భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు…. కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ. 2 కోట్లు చొప్పున నిధుల విడుదల చేస్తున్నాం.
• పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది.
• ప్రొక్లయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలి.
• నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి.
• ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయండి. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.
• బుడమేరులో నీటి ఉద్ధృతి తీవ్రంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు సీఎంకు తెలిపారు. బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించడంతో .సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళిక వేయాలని సీఎం సూచించారు.
• వరద ప్రాంతాల్లో, వాగులపై వాహనదారులను అనుమతివద్దు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయండి
• ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయండి.
• భారీ వర్షాలు, గాలుల వల్ల తీగలు తెగి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కరెంట్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలి.
• కనకదుర్గ టెంపుల్ లో ప్రమాదం విచారకరం. భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి
• కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరం అయితే ఖాళీ చేయించండి. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలి.
• సైక్లోన్ షెల్టర్స్ ను సిద్ధం చేసి పునరావాసం కోసం ఏర్పాట్లు చేయండి
• గర్భిణుల వివరాలు సేకరించి. అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉండండి
• మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా క్షణక్షణం ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నా.. అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదు.
• భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.
• వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చేయాలి
• ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం సహాయం చేయడం కాదు….ప్రమాదం జరగకుండా చూడడం పై యంత్రాంగం దృష్టిపెట్టాలి
• భారీ వర్షాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాను…
అధికారులు కూడా వాట్స్ యాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెప్పించుకుని వేగంగా స్పందించాలి
• అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాలి
• హుద్ హుద్ తుపాను సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు స్టడీ చేయాలి. నాడు తీసుకున్న పటిష్ఠ, ముందస్తు చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చేశాం.
• ఆ విధానాలను స్టడీ చేసి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.