రాయలసీమలో 40 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రభుత్వంలో ఒక మంత్రి అంటున్నాడు. ఏ విధంగా అంటే.. ఏం చేసైనా గెలుస్తాం అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని సీరియస్‌గా గమనించాలి. రాయలసీమలో అనేకమంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మేము కౌంటింగ్ వరకు డ్యూటీలో ఉండి విధులు నిర్వ హించలేం..మాకు దీర్ఘకాలిక సెలవులు ఇప్పించండి..అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయంటూ ఢల్లీిలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఫలితాల ప్రకటన తదితర విషయాల్లో ఆర్వోదే తుది నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్వోగా ఎవరు ఉన్నారు? రెవెన్యూ శాఖలో పనిచేసే డివిజన్ స్థాయి అధికారులు అయిన డిప్యూటీ కలెక్టర్లు. వీరిలో ఎక్కువ మందికి అధికార పార్టీ అయిన వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తే ఎవరికైనా ఈ విషయం తేలిగ్గానే అర్థం అవుతుంది. అఖిల భారత సర్వీసుల అధికారులు అయిన ఐఏఎస్ అధికా రులు కొంత నయం.
మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ విధులు నిర్వహించలే మంటున్న ఎన్నికల అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని అంటు న్నారు. ఇది దేశద్రోహం కిందే లెక్క అని చెప్పారు. ఒకవేళ వీరి విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? ఏ ధైర్యంతో ప్రభుత్వంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి 40 స్థానాల్లో ఏ విధంగానైనా విజ యం సాధిస్తున్నామంటున్నాడు. దీనిని తేలిగ్గా కొట్టి పారవేయకూడదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలింగ్ తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో హింస జరుగుతున్నా, ఎన్ని వేల ఫిర్యాదులు పంపినా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని సీఈసీ ఇంతవరకు బదిలీ చేయలేదు. రాయలసీమలో ఆర్వోలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలరా? వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది. వెనుక ఎవరున్నారు? నిజంగా ఇలా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం కాకుండా ఉంటుందా?
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతున్న మే 13న ఈవీఎంను పగులగొడితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్వో తదితర అధికారులు ఏం చేస్తున్నారు? అతడు టీడీపీ ఎన్నికల ఏజెంట్ నంబూరి శేషగిరిరావును బెదిరించారు. వెంటనే ఆయన అను చరులు కత్తులతో తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు ఎందుకు వారిపై హత్య కేసు నమోదు చేయలేదు? మాచర్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించిన ఆర్వో, జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యే వ్యవహారం ఈ వారంరోజులూ రహస్యంగా ఉంచారా? ఢల్లీిలోని కేంద్ర ఎన్నికల సంఘం అదేశాలు ఇచ్చే వరకు కూడా తీవ్రమైన నేరానికి పాల్పడ్డ పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు అంటే పోలీస్ అధికారులు ఏ స్థాయిలో వైసీపీకి కొమ్ము కాస్తున్నారో అర్థం అవుతోంది. ఎమ్మెల్యేను ఎవరు రక్షిస్తున్నారు? వేళ్లన్నీ జవహర్‌రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ప్రజల తీర్పును వమ్ము చేస్తే కసితో రగిలిపోతున్న ప్రజలు మౌనంగా చూస్తూ కూర్చుంటారా? శాంతి భద్రతలు అదుపు చేయగలరా?
విజయవాడలో దేశ ప్రధాని పాల్గొనే ఎన్నికల సభ ప్రాంగణాన్ని ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి స్వయంగా విజయవాడలో దేశ ప్రధాని పాల్గొన్న ఎన్నికల సభలో నిబంధనలకు విరుద్ధంగా దుండగులు డ్రోన్లు ఎగురవేశారు. అంటే పోలీస్ అధికారులు శాంతి భద్రతల నిర్వహణ ఏపీలో ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో అర్థం అవుతుంది. ఇంత జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం/ కేంద్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని ఎందుకు బదిలీ చేయడం లేదు? దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలకు జవాబు చెప్పాలి?
వైవీ, రిటైర్డ్ తహసీల్దార్, ఖమ్మం