– కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు, మహానాడు: తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 56 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 36 ఫిర్యాదులు అందాయని, పెన్షన్లు, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, ప్రజల సౌకర్యార్ధం నెలకొకసారి నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయిలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయిలలో అందె ఫిర్యాదులను పీజీఆర్ఎస్ ఆన్లైన్ లో నమోదు చేసి టైమ్ లైన్ ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దేశిత సమయం ఉంటుందని, నిర్ణీత గడువు లోపు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ అన్నపూర్ణ, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, తదితరులు పాల్గొన్నారు.