6,840 ఎకరాల భూమిని రూ. 529 కోట్లకు కొట్టేయాలని కుట్ర!

ఏపీఐఐసీ భూములైనా పట్టించుకోని వైనం
• బ్యాంకులు ఎవరితో చేతులు కలిపాయో బయట పెట్టాలి
• కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

మంగళగిరి, మహానాడు: జగన్ ఐదేళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు లేపాక్షి భూముల్లో ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్… 2019లో అధికారంలోకి వచ్చాక ఆ 8,884 ఎకరాల భూములను కారు చౌకగా రూ.500 కోట్లకు కొట్టేయాలని కుట్ర పన్నారు. ఈ ఎనిమిది వేల ఎకరాల్లో 5,811 ఎకరాలు అసైన్డ్ భూములు కాగా, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. గతంలో సైన్స్ అండ్‌ టెక్నాలజీకి ఈ భూములను ఇస్తే శ్యాం ప్రసాద్ రెడ్డి వాటిని బ్యాంకులో కొదవపెట్టారు. అది ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి అధికారులు అక్రమంగా వేల కోట్ల లోన్లు ఇచ్చారు. తిరిగి డబ్బులు కట్టకపోవడంతో కొదవ పెట్టిన భూములు ఇవ్వాలంటూ బ్యాంకు ఒత్తిడి చేసి ట్రిబునల్ లో ఫిర్యాదు చేశాయని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇక్కడి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు.

అసలు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా ఆ భూములకు రూ. ఇవ్వాల్సిన 4 వేల కోట్లు చిల్లర అవసరంలేదని.. 5 వందల కోట్లు ఇస్తే చాలని బ్యాంకులే డిసైడ్ చేసి వైసీపీ నేతలతో కుమ్మక్కై జగన్ రెడ్డి బంధువు మేనమామ రవింద్ర నాథ్ రెడ్డి ఆ భూములను రూ. 501 కోట్లకు కట్టబెట్టడానికి యత్నించాయి. ఆ భూములకోసం రూ. 50 కోట్లు ఇచ్చిన రవింద్రనాథ్ రెడ్డి మిగిలిన డబ్బులు కట్టలేనని చెప్పి.. అదే భూములకు కడపకు చెందిన సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డిలు తక్కిన డబ్బులు కడతారని బ్యాంకులతో అక్రమ ఒప్పందం చేసుకున్నారు. బ్యాంకులు సరే అన్నాయి. కాని అసలు ఆ భూమి ఏపీఐఐసీకి చెందినది బ్యాంకులు అలా అక్రమంగా కారు చౌకగా భూములు అమ్మేయడానికి వాటికి అధికారం లేదు. ఎన్ఫోర్స్ మెంట్ జోక్యం, ట్రిబునల్ తీర్పులతో ఆ భూముల అమ్మకానికి అడ్డుపడినట్లైంది.

బ్యాంకులు ఎందుకు 10శాతం కోరుకున్నాయి?

ఎస్బీఐ, ఐడీబీఐ, సిండికేట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరాబ్యాంక్, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, ఎస్ఆర్ తో పాటు పలు ప్రైవేట్ బ్యాంకులు నాలువేల కోట్లు ఇచ్చి ఎందుకు 90% వద్దనుకుని 10% నే కోరుకుంటున్నాయి. ఎవరు ఎవరితో మిలాకత్ అయ్యారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు?. ఇది డేలైట్ మోసం. మొత్తం ఎమిమిది వేల ఎకరాల్లో మరో నాలుగువేల ఎకరాలు ఉండగా అందులో రెండువేల ఎకరాలకుపైగా శ్యాంప్రసాద్ రెడ్డి ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసంస్థకు రూ. 238 కోట్లకు అమ్మేస్తూ.. రూ. 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని విజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఈడీ కేసులు పెట్టడంతో అది రిజిస్ట్రేషన్ కాలేదు. ఇది అంతా జరిగి దాదాపు దశాబ్ధం జరిగిపోయింది.

లేపాక్షి భూములకోసం ఐదు కోట్లు ఇచ్చామని నేడు అది వడ్డీతో పాటు రూ. 28 కోట్ల చిల్లర అయ్యిందని… అందుకని ఆ 2,650 ఎకరాలను తమకు ఇచ్చేయాలని ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ డిమాండ్ చేస్తోంది. దానికోసం బెంగులూరు ట్రిబునల్, చెన్నై ట్రిబునల్ ను ఆశ్రయించింది. అసలు భూములు ఎవరివో పూర్తి విచారణ చేయకుండా ఆ భూములను ఇవ్వడానికి అనుకూలంగా ఆ ట్రిబునల్స్ తీర్పు ఇవ్వడం దారుణం. ఈ భూములపై రేపో మాపో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. సుప్రీం కోర్టు గ్లోబల్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే రూ. 25 కోట్లకే ఆ 2,650 భూములు వెళ్లిపోతాయి.

అసలు నాలువేల కోట్లకుపైగా తాకట్టు పెడితే ఎందుకు బ్యాంకులు ఐదు వందల కోట్లు మిలాకత్ అయ్యాయో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తేల్చి రైతుల భూములను, ప్రభుత్వ భూములను నేటి కూటమి ప్రభుత్వం కాపాడాలి… బ్యాంకులు చేసిన మోసాన్ని బయట పెట్టాలి. లేదా ప్రభుత్వం తరఫున బిడ్ వేసి ఆ ఐదువందల కోట్లకు లేపాక్షి భూములను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఈడి జప్తు చేసిన భూములను రిలీజ్ చేయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.