– సరుకు, వాహనాల స్వాధీనం
– డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశామని డిఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎనిమిది నిందితుల నుంచి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, రూ.13 లక్షలు విలువ ఉన్న ఎనిమిది ద్విచక్రవాహనాలు, ఒక కారును అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇదిలావుండగా, దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, నిందితుల వద్ద నుండి మహిళ వద్ద అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని నాగేశ్వరరావు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సీఐ విజయ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.