ఎన్టీఆర్ లాంటి నేత నభూతో నభవిష్యత్
సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం 41వ వార్షికోత్సవం స్ఫూర్తిదాయక దినోత్సవం
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 41ఏళ్లు పూర్తి..1983 జనవరి 9 తెలుగుజాతి చరిత్రనే మలుపు తిప్పిన శుభదినం..దేశానికే దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారత రాజకీయాలకే దిక్సూచిగా నిలబడ్డ రోజు.
ఎన్టీఆర్ రాజకీయం కేవలం పుష్కరకాలమే, అధికారంలో ఉంది ఆరున్నరేళ్లే..కానీ ఈ స్వల్పకాలంలో ఇన్ని విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి చరిత్రనే తిరగరాయడం అద్భుతం, అపూర్వం, అనన్యసామాన్యం..అందుకే ఎన్టీఆర్ చారిత్రక పురుషుడు అయ్యాడు. మనుషుల్లో దేవుడిగా మారాడు..తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించడం, దేవదాసీ-జోగినీ వ్యవస్థ నిర్మూలన, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, బీసీలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, మాండలిక వ్యవస్థ ఏర్పాటు, ప్రజల వద్దకే పాలన తేవడం, సహకార రంగం ప్రక్షాళన, రైతు రుణాల మాఫీ, పంటరుణాలపై వడ్డీ మినహాయింపు, ట్రాక్టర్లపై పన్ను రద్దు…ఒకటేమిటి, వందలాది సంస్కరణలు తెచ్చిన విప్లవ నాయకుడు.
రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే సమూలంగా మార్చినఘనత ఎన్టీఆర్ దే..ఏకపార్టీ పెత్తందారీ తనానికి, గుత్తాధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడారు. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు నాంది పలికారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు, సర్కారియా కమిషన్ సిఫారసులు, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయించాడు..కేంద్ర ఉన్నతోద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు దోహదపడ్డారు.
ఆరున్నరేళ్ల అధికారంలో, 12ఏళ్ల రాజకీయంలో ఇంత పెద్దఎత్తున మార్పులకు, సంస్కరణలకు నాంది పలికిన నేత నభూతో నభవిష్యత్..ఆయనతో కలిసి పనిచేయడం, ఆయన బాటన నడవడం మా అందరి అదృష్టం..జీవితాంతం ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా త్రికరణశుద్దిగా పనిచేస్తాం, అదే ఆయనకిచ్చి మనందరి ఘన నివాళి.
ఎన్టీఆర్ అమర్ రహే
కంభంపాటి రామమోహన రావు(మాజీ ఎంపి)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
(తెలంగాణ టిడిపి వ్యవహారాల ఇన్ ఛార్జి)