– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : కండువాలు కప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని గ్రామీణ వైద్యులు (బిఎంపీ, పీఎంపీలు) కోరారు.
వారి సమస్యలపై స్పందించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. గ్రామీణ వైద్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక మార్లు రెండు బస్సుల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గ్రామీణ వైద్యులను తీసుకువెళ్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల దృష్టికి వారి సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి గ్రామీణ వైద్యులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. అయితే వారికి శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించి పారామెడిక్స్ కింద వారిని గుర్తించాలని నాడు అనుకున్న అంశమన్నారు. అటు తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వారికి నష్టం కలుగుకుండా చూడాలన్న ప్రయత్నాలయితే జరిగాయని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాలు అమలు దశకు చేరే సమయంలో ప్రభుత్వం మారడం, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు.
జగన్ గ్రామీణ వైద్యులకు అనేక హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేశాడరని ధ్వజమెత్తారు. గ్రామీణ వైద్యులను క్వాక్స్ (తప్పులు చేసే మనుషులు) అని ప్రభుత్వం సంభోదించినప్పుడు ఆ సమయంలో నోరు మెదపని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఇప్పుడు వారి అవసరం కనిపిస్తోందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామీణ వైద్యులను మళ్లీ నమ్మించి మోసం చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారం కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ఆ దిశగా ఆలోచనలు చేయాలని గ్రామీణ వైద్యులను ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, మండల రవి, గ్రామీణ వైద్యులు తదితరులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు.