రాజ్యసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా సీఎం రమేష్ ?

– ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ఉత్సాహం
– ఇంకా బీజేపీ నుంచి లభించని అనుమతి
– అనుమతి వస్తే పోటీకి సిద్ధం
– వైసీపీ రెబెల్, టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లపై కన్ను
– బీజేపీ అనుమతిస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ ఎంపి.. సీఎం రమేష్ రంగంలోకి దిగనున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న రాజకీయ గందరగోళ పరిస్థితులు, అధికార పార్టీలో నెలకొన్న తిరుగుబాట్లను సద్వినియోగం చేసుకుని, తిరిగి రాజ్యసభకు వెళ్లాలన్నది సీఎం రమేష్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరమైన మలుపు తిరగనున్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వారి స్థానంలో మళ్లీ ఎంపిక జరగనున్న నేపథ్యంలో… ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు, సీఎం రమేష్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆయన ఇప్పటికే పలువురు టీడీపీ, టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది.

టీడీపీ సహకారంతోపాటు.. ప్రస్తుతం వైసీపీ టికె ట్ కోల్పోయిన ఎమ్మెల్యేల ఓట్లతో, తిరిగి ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టాలన్నది రమేష్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ ఎంపీగా ఉన్న ఆయనకు, పార్టీ నాయకత్వం ఆ మేరకు మద్దతునిస్తుందా? లేదా? అన్నదే చూడాలి. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత, ఆయన తన పని ప్రారంభిస్తారంటున్నారు. రాజ్యసభ అభ్యర్ధిత్వం కోసం కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ ఏపీ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యమే లేదు. ఈ నేపథ్యంలో కనీసం సంతకాల కోసమైనా, ఆయనకు 10 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరం.

అమిత్‌షా సహా పార్టీ అగ్రనేతలతో సాన్నిహిత్యం ఉన్న రమేష్, తనకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో ఆయన ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో, బీజేపీ పక్షాన ఫ్లోర్ కోఆర్డినేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ నాయకత్వం అవసరాలు గ్రహించి, ఆ మేరకు పార్టీ బాసులని మెప్పించటంలో సీఎం రమేష్ నిష్ణాతుడని పేరున్న సంగతి బహిరంగ రహస్యం.

వైసీపీ-బీజేపీకి నేరుగా పొత్తు లేనందున, వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేయడం అసాధ్యం. టీడీపీ-బీజేపీ పొత్తు ఇంకా ఖరారు కానందున, టీడీపీ అధికారికంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించడం కూడా కష్టమే. ఈ పరిస్థితులో సీఎం రమేష్ ఆశలు ఏవిధంగా నెరవేరతాయో చూడాలి.

అయితే వైసీపీ అధినేత జగన్..భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం తన కోటా నుంచి, బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇస్తానని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. దానిపై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లి, అమిత్‌షాను కలిసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు.. టీడీపీ స్ధాపించిన తర్వాత, ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఈసారి కనకమేడల రవీందర్ రిటైర్మెంట్ తర్వాత, టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం పార్టీ చరిత్రలో తొలిసారి. ఈ నేపథ్యంలో గత శాసనమండలి ఎన్నికల మాదిరిగా టీడీపీ ఈసారి కూడా రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో తన పార్టీ నేతను నాలుగో అభ్యర్ధిగా బరిలోకి దింపే అవకాశాలు కొట్టివేయలేం. ఆ ప్రకారం మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో… శాసనసభలో బలం లేకపోయినా, వైసీపీ అంతర్గత కుమ్ములాటలను సొమ్ము చేసుకుని, పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించుకుని, వైసీపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తన అభ్యర్ధిని నిలిపి.. రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కొనసాగించేందుకు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి చక్రం తిప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.