సికింద్రాబాద్, తిరుపతి లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు

● కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. సికింద్రాబాద్, తిరుపతిలో ఏర్పాటు
● ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (IECT), సంబంధిత రంగాలకు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ
● తెలుగు రాష్ట్రాల యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, నిరుద్యోగులకు మోదీ సర్కారు చేయూత
● NIELIT చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ రెండు కేంద్రాలు
● స్థానికంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలకు తీరనున్న మానవ వనరుల కొరత
● రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ
● ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఐటీ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి.. భారతదేశం మరింత పురోగతిని సాధించేందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి దిశగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సెంటర్ల ఏర్పాటుకోసం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పలుమార్లు చర్చించారు. దీనిపై చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుని ఈ సెంటర్లను సికింద్రాబాద్, తిరుపతిల్లో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.

సికింద్రాబాద్, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 3 ఏళ్ల వ్యవధిలో ఈ కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. NIELIT చెన్నై ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించనున్న ఈ కేంద్రాల కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించనున్నట్లు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఒక్కో NIELIT కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాలలో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశం. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాలలో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి టెక్నాలజీ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు, వ్యాపారాల ఏర్పాటు పెంపొందించడానికి కూడా ఈ కేంద్రాల ద్వారా కృషి చేయడం జరుగుతుంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(NIELIT) అనే సంస్థ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుంది. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో NIELIT కీలకపాత్రను పోషిస్తుంది.

సికింద్రాబాద్, తిరుపతి నగరాలలో NIELIT కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర పడటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాలానుగుణంగా టెక్నాలజీ రంగాలలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను అందించే NIELIT కేంద్రాలను రెండు తెలుగు రాష్ట్రాల యువత కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు