కిషన్ రెడ్డి చేతుల మీదుగా రేపే కొమురవెల్లి రైల్వేస్టేషన్ శంకుస్థాపన

– హాజరుకానున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
– రైల్వే సేవలు అందుబాటులోకి రానుండడంతో భక్తుల హర్షం

హైదరాబాద్: మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్‌కు గురువారం (15 ఫిబ్రవరి, 2024) శంకుస్థాపన జరగనుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హాజరుకానున్నారు.

500 ఏళ్ల నాటి పురాతన శివాలయమైన కొమురవెల్లికి తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశం నలుమూలలనుంచి భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ మార్గంలో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వేలైనును మంజూరు చేసింది. పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో కొమురవెల్లిలో భక్తుల సౌకర్యార్థం.. రైల్వే స్టేషన్ ఉండాలంటూ డిమాండ్లు రావడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతీసుకుని.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరాన్ని వివరించారు.

దీనిపై చర్చించిన తర్వాత కొమురవెల్లిలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు.