వాళ్లను చెప్పుతో కొట్టండి

-బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు
-పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే వెంటపడి కొట్టేటట్లున్నరని వ్యాఖ్య
-కేసీఆర్ ఢిల్లీ పోతే ఏంటి? పాకిస్తాన్ పోతే మాకేంటి?
-అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
-కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు?
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
-తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
-మండుటెండలో బస్సు యాత్ర

బీజేపీ కార్యకర్తలారా….. ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పొత్తుపై మీడియాకు పదేపదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు.
హిందుత్వం గురించి మాట్లాడలేని రోజు రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు..

విజయ సంకల్ప యాత్రలో భాగంగా బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీఎల్ వర్మ, బండి సంజయ్ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. అంతకుముందు మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులోని ముఖ్యాంశాలు…

ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది?. రైతులు, మహిళలు, యువత పక్షాన లాఠీదెబ్బలు తిని, అరెస్టై, జైలుకు పోయింది బీజేపీ. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీ… మరి ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారు?. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈసారి ప్రజల ఓట్లు మోదీకే వేయబోతున్నారు.

రాముడిని కొలిచే వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారు. రామ మందిరం వద్దనుకునే వాళ్లు కాంగ్రెస్ కు ఓటేసుకోవచ్చు. మావైపు రాముడు, మోడీ ఉన్నారు.. వాళ్లవైపు రాక్షసులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలున్నయ్. ఎవరు కావాలో తేల్చుకోండి. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ కావాలా? ఎలుకల మాదిరిగా బియ్యాన్ని కూడా మెక్కేందుకు సిద్ధమైన కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి. ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేయడంతోపాటు కరోనా వ్యాక్సిన్ తో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మోదీ. ఆర్దిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే.

బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ మీడియాకు లీకులిచ్చి వార్తలు రాయించే తొత్తులారా? ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్…. కార్యకర్తలారా… మీరంతా చెప్పులు తీయండి. ఇకపై ఎవడైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉందని అంటే వాళ్లను చెప్పుతో కొట్టండి. అసలు మునిగిపోయిన బీఆర్ఎస్ తో పొత్తు ఎవరు పెట్టుకుంటారు? కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది స్కాచ్ తాగడానికే.. ప్రజలే ఛీత్కరించిన కేసీఆర్ ఢిల్లీ పోతే ఏంటి? పాకిస్తాన్ పోతే మాకేంటి?. కేసీఆర్ చాలా డేంజర్. ఎంతకైనా దిగజారతారు.

పొరపాటున బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని మేం చెబితే… బీజేపీ కార్యకర్తలు మమ్ముల్ని కూడా వెంటపడి కొడతారు.. బీఆర్ఎస్ అంటే అంత కసితో ఉన్నరు…

నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటే. అసెంబ్లీలో రెండు పార్టీలు డ్రామాలాడినయ్. ఒకరు కాళేశ్వరం అంటే.. ఇంకొకరు క్రిష్ణా జలాలంటూ నాటకాలాడుతున్నరు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసిందని సీఎంసహా ప్రభుత్వం చెప్పింది. విజిలెన్స్, కాగ్ సహా నివేదికలిచ్చింది. మరి కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వాళ్ల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు?

అట్లాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసిందా? ఎందుకు ప్రశ్నించలేదో తెలుసా?.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటే. వీళ్లిద్దరి మధ్య ఒప్పందం ఉంది. అందుకే ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే 70 రోజులు దాటిపోయాయి. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఎన్నికల కోడ్ తో హమీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకు డ్రామాలాడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలి. నిధులు ఎక్కడి నుండి తెస్తారు? జీతాల చెల్లింపులకే నిధుల్లేవు. అప్పులు పుట్టడం లేదు? మరి హామీలు ఎట్లా అమలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదు?