పంట‌ల కొనుగోళ్ల‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తాం

– ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులను చేయ‌డ‌మే ల‌క్ష్యం…

* విద్యార్థుల యూనిఫాంల త‌యారీ ఎస్‌హెచ్‌జీల‌కు అప్ప‌గిస్తాం…
* పారిశ్రామికవేత్త‌లుగా ఎదిగేందుకు చేయూత‌నిస్తాం…
* స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
* ఎస్‌హెచ్‌జీల‌కు రూ.177 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు అంద‌జేత‌

కోస్గి: ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులు చేయ‌డ‌మే త‌మ‌ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో రూ.ల‌క్ష‌ల‌కు విలువ లేనందున వారిని కోటీశ్వ‌రులుగా తీర్చిదిద్దుతామ‌న్నారు. వివిధ చిరు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకొని వారు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగ‌డానికి అన్నిర‌కాలుగా అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి అభ‌యం ఇచ్చారు.

రూ.2945.50 కోట్ల‌తో కొడంగ‌ల్‌, నారాయ‌ణ‌పేట‌, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు ఇచ్చేందుకు నిర్మించ‌నున్న‌ నారాయ‌ణ‌పేట‌-కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌తో పాటు కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తంగా రూ.4369.143 కోట్ల‌తో నిర్మించ‌నున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల, పారా మెడిక‌ల్ క‌ళాశాల‌, న‌ర్సింగ్ క‌ళాశాల‌, ఫిజియోథెర‌పీ క‌ళాశాల‌, ఇంజినీరింగ్ క‌ళాశాల‌, ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ర‌హ‌దారులు, వంతెన‌లు ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం శంకుస్థాప‌న చేశారు. త‌ర్వాత కోస్గిలో స్వ‌యం స‌హాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు.

అనంత‌రం ఆయా సంఘాల మ‌హిళ‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌లో చ‌దివే విద్యార్థుల‌కు యూనిఫాంలు కుట్టే అవ‌కాశాన్ని ఎస్‌హెచ్‌జీల‌కు ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున యూనిఫాంల త‌యారీకి అవ‌స‌ర‌మైన అధునాత‌న కుట్టు మిష‌న్లు, ఇత‌ర స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని ఆయ‌న వెల్లడించారు.

గ‌తంలో కొడంగ‌ల్ ప్రాంతంలోని ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌లు కందులు కొనుగోలు చేసి న‌ష్ట‌పోయార‌ని, దాని నుంచి తేరుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. భ‌విష్య‌త్తులోని పంట‌ల కొనుగోళ్ల‌ను సంఘాల ద్వారానే కొనుగోలు చేయిస్తామ‌ని, ఈ క్ర‌మంలో ఆయా సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాలు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.

* విద్యా కేంద్రంగా కొడంగ‌ల్‌…

కొడంగ‌ల్ ప్రాంతంలో గతంలో చ‌దువుకోవ‌డానికి బడులు లేవ‌ని, చ‌దువుకోవ‌డానికి ఇక్క‌డ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే ప‌రిస్థితి ఉండేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వైద్య క‌ళాశాల‌, న‌ర్సింగ్ క‌ళాశాల, ఇంజినీరింగ్ క‌ళాశాల‌, పాలిటెక్నిక్ క‌ళాశాల‌, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ క‌ళాశాల‌, జూనియ‌ర్ క‌ళాశాల‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని, దీంతో రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల విద్యార్థులు ఇక్క‌డ‌కు రానున్నార‌న్నారు. కొడంగ‌ల్ ప్రాంతం విద్యాకేంద్రంగా మార‌నుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్‌హెచ్‌జీల‌తో స‌మావేశం అనంత‌రం నారాయ‌ణ‌పేట‌, వికారాబాద్ జిల్లాలోని 3083 మ‌హిళా సంఘాల‌కు బ్యాంకు లింకేజీ కింద రూ.177 కోట్ల చెక్కును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అంద‌జేశారు.

రేవంత్ రెడ్డి పోరాటంతోనే ఒంట‌రి మ‌హిళ‌లకు పింఛ‌ను

ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో చేసిన పోరాటంతోనే ఒంట‌రి మ‌హిళ‌ల‌కు పింఛ‌ను వ‌చ్చింద‌ని ఆజ‌మ్మ అనే మ‌హిళ అన్నారు.. ఎస్‌హెచ్‌జీలతో స‌మావేశంలో జోగిని వ్య‌వ‌స్థ నుంచి బ‌య‌ట‌ప‌డి దాని నిర్మూల‌న‌కు పాటుప‌డిన ఆజ‌మ్మ మాట్లాడారు. జోగినిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, జీవ‌న‌పోరాటాన్ని వివ‌రించ‌డంతో పాటు స్వ‌యం స‌హాయక బృందంతో ఎదిగిన తీరును ఆమె వివ‌రించారు.