వివేకా హత్యలో నిర్దోషి అయితే వదిలేయాలి
నాన్నను గొడ్డలితో చంపారని జగనన్నకు ఎలా తెలుసు?
జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు
షర్మిల ఒక్కరే నాకు అండ
అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది
మీడియాతో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి
ఢిల్లీ : తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ పాత్ర పై సీబీఐ విచారణ జరపాలని.. జగన్ సోదరి డాక్టర్ సునీతా రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ కేసు ఇన్నాళ్లు ఎందుకు సాగుతుందో తనకు అర్థం కావడం లేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డికి తప్పకుండా శిక్ష పడుతుందని, షర్మిల ఒక్కరే తనకు కష్టకాలంలో అండగా నిలిచారని చెప్పారు తన తండ్రిని గొడ్డలితో చంపారని జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నాస్త్రం సంధించారు. జగనన్న పార్టీ వైసీపీకి ఎవరూ ఓటు వేయవద్దని, నమ్మించి మోసం చేసేవారిని, సొంత అనుకున్న వారిని మట్టుపెట్టే వారిని శిక్షించాలని ప్రజలను కోరారు.
మీడియాతో సునీతారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. మా తండ్రి వైఎస్ వివేకా 2019 మార్చి 14-15 రాత్రి ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐదేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బందిపడింది. నేను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్యకేసు గురించే అడుగుతున్నారు. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతలు. నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు. చంద్రబాబు, మహాసేన రాజేష్, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలా మంది సహకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, తీర్పు నాకు కావాలి. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు. సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం . ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు. మార్చురీ వద్ద అవినాష్.. నాతో మాట్లాడారు. పెదనాన్న 11.30 వరకు నాకోసం ప్రచారం చేశారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుంది.
వివేకా హత్యకేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ ను అడిగా. సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీకి వెళ్తారని అన్నారు. అరెస్టు, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టింది. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదు. సీబీఐ పైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారు. నిందితులను పట్టుకోవడంలో ఇంత జాప్యం ఏ కేసులో లేదు .
కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. అవినాష్ రెడ్డి అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా? వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది. నాకు ప్రజాకోర్టులో తీర్పు కావాలి. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే నాకు న్యాయం జరుగుతుంది. ముందు సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు?
కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు? శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత మొత్తం కేసు మారిపోయింది. శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత భయం మొదలైంది. అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారు. విలువలు, విశ్వసనీయత పదే పదే అంటుంటారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటుంటారు. మా నాన్న హత్య కేసులో ఏమయ్యాయి? వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది ?
మంచి, చెడుకు యుద్ధమంటున్నారు.. ఏది కరెక్టో వాళ్లే చెప్పాలి. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. పట్టించుకోవట్లేదు. సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. హైదరాబాద్ కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైంది. హత్యా రాజకీయాలు ఉండకూడదు. జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దు. తమ అనుకునే వాళ్లకే న్యాయం చేస్తారా? అవినాష్, భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారు.
జగన్ పాత్రపై విచారణ జరగాలి, నిర్దోషి అయితే వదిలేయాలి. జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి. నాన్నను గొడ్డలితో చంపారు అనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? జగనన్నకు ఎలా తెలుసో విషయం బయటికి రావాలి. జగన్ తో భేటీ అయినప్పుడు.. ఆయన మాట్లాడిన విధానం చూసి అప్పుడు అనుమానించలేదు. సొంత కుటుంబం మీద ఎవరికీ అనుమానం రాదు.
కానీ, ఒక్కో వాస్తవం బయటికి వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. నా పైనే కేసులు పెట్టారంటే.. ప్రభుత్వం వెనుక ఉంది కాబట్టే పెట్టారు. అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది. తప్పు చేసినవారు తప్పించుకోకూడదు. అందరినీ అనుమానించాల్సిందే.. విచారించాల్సిందే. నన్ను విచారణ చేసినట్లే అందరినీ విచారణ చేయాలి. విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను గుర్తించాలి.