ఎవరీయన..? యువతలో ఎందుకింత క్రేజ్ జ్ జ్ జ్..!?

తమ నియోజకవర్గ అభ్యర్థి కన్నా ఎక్కువగా ఆయన గురించే ప్రజలు చర్చించుకుంటున్నారెందుకు? ఏంటి వారి ప్రత్యేకత..?

పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా.. సమస్య పుట్టగానే నాయకుడు పుడతాడు. సమస్యను పరిష్కరిస్తూ ఆవిర్భవించిన నాయకుడే ప్రజాదరణ పొందుతాడు.

కష్టపడి చదివేవారు ఉంటారు, ఇష్టపడి చదివేవారు ఉంటారు. వీరిలో రెండవ రకం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చంద్రశేఖర్ పెమ్మసాని ఎంసెట్ లో మంచి ర్యాంక్ (27) తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో MBBS పూర్తిచేసారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.

అమెరికా వెళ్లిన మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను మన దేశం నుండి అమెరికా వెళ్లిన విద్యార్థులు ఎదుర్కోనకూడదు అనే సదుద్దేశంతో, తన శక్తిమేర ఎన్నో సేవలను అందిస్తూ వారికి బాసటగా నిలిచారు. చిన్నతనం నుండే సమాజం పట్ల ప్రేమ, తనలో ఉన్న సేవాగుణం.. నాడే సమాజసేవ పట్ల మొగ్గతొడిగిందిని చెప్పాలి.

డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని 25 సంవత్సరాల చిన్న వయసులో అమెరికాలో UWorld సంస్థను వ్యవస్థాపించారు. ఈ UWorld అనే సంస్థ ద్వారా, మిలియన్ల మంది విద్యార్థులు వారి విద్యా మరియు వృత్తి కలలను సాకారం చేసుకున్నారు. వైద్యంతో పాటు UWorld.. అకౌంటింగ్, ఫైనాన్స్, గ్రాడ్యుయేట్ స్కూల్, హైస్కూల్, నర్సింగ్ మరియు ఫార్మసీలో అనేక సేవలను, ఉత్పత్తులను అందిస్తుంది.

ఖండాంతరాలు దాటిన మన డాక్టర్ చంద్ర.. మాతృభూమిపై ఎనలేని ప్రేమతో తన స్వగ్రామమైన బురిపాలెంలో, తాను పుట్టి పెరిగిన నరసరావుపేటలో ఎన్నో సేవలను అందిస్తూ వచ్చారు. ఆయన అందించిన, అందిస్తున్న సేవలు గురించి ఒక్కొక్కటిగా ఇక్కడ ప్రస్తావించడం మొదలుపెడితే.. రాయడానికి నాకు ఓపిక ఉంది కానీ చదవడానికి మీకు గంటల సమయం పడుతుంది.

ప్రజలకు విస్తృతస్థాయిలో సేవలను అందించాలంటే రాజకీయాలలో ఉండడం ముఖ్యం. ఒక నిస్వార్థ నాయకుడు రాజకీయాలలో ఉంటే అద్భుతాలు చేయగలడు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించగలడు. ఇలాంటి సదుద్దేశంతోనే ఒక డాక్టర్ గా, UWorld CEO గా అమెరికాలో ఎన్నో అవార్డులు పొందిన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

తొలి ప్రయత్నంలోనే తమకు అవకాశం దక్కాలని, ఆశించిన వెంటనే తమ ఆశలు ఫలించాలని భావించే ఎందరో నాయకులను మనం చూశాము . అధిష్టాన నిర్ణయం తమకు కాస్త అనుకూలంగా లేకపోయేసరికి , చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారడం చూశాము . అధినాయకుడిని దూషించడం చూశాము. అప్పటివరకు తమకు గుర్తింపునిచ్చిన పార్టీపై విచక్షణ కోల్పోయి దుమ్మెత్తిపోయడం చూసాము. ఇలాంటి వారిని ఎందరినో చూశాము .. చూస్తూనే ఉన్నాం……..

కొంతమంది అనుకుంటారు. పెమ్మసాని ఆశించిన వెంటనే అవకాశం దక్కిందని. కాదు కానే కాదు.. 2014 లోనే ఆయన పోటీకి సిద్ధమయ్యారు బలమైన ఆర్ధిక నేపథ్యం ఉన్నా సరే వారికి అవకాశం దక్కలేదు. తిరిగి 2019 లో మరలా సిద్ధమయ్యారు ప్రయత్నం ఫలించింది. అవకాశం దక్కింది. సర్వం సిద్ధం చేసుకున్నారు. చివరి క్షణంలో అనుకోని విధంగా తన స్థానాన్ని వేరొకరికి (రాయపాటి సాంబశివరావుకు) త్యాగం చేయాల్సివచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, అధినాయకుడి ఆదేశాలే తనకు శిరోధార్యం అని భావించిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని.

చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు, నిరాశ నిస్పృహలకు గురికాలేదు. తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ పార్టీ పట్ల, చంద్రబాబు పై తన గౌరవాన్ని, తెలుగుదేశం పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొన్ని సందర్భాల్లో చెప్పే మాట, ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటుంది. “నేను అమెరికాకు వెళ్లినప్పుడు నా వెంట ఉంటూ.. నన్ను ప్రోత్సహించింది WHITE PEOPLE, BLACK PEOPLE మాత్రమే. వారికి నా ముక్కు మొహం తెలియకపోయిన వారు నాకోసం ఎంతో చేశారు. అలాంటప్పుడు నాకు తెలిసిన నా ప్రజల కోసం నేను ఎంత చేయాలి..? ”

మహేష్ బాబు సినిమా ‘బిజినెస్ మేన్’ లో ఒక డైలాగ్ ఉంది “నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు.. ఈ ముంబాయిని……” అంటూ చిటికెన వేలు చూపిస్తాడు. అలాగే డాక్టర్ పెమ్మసాని కూడా “గుంటూరులో ఏదో రాజకీయం చేసేద్దాం అని రాలేదు.. గుంటూరు పార్లమెంట్ ను నెంబర్ వన్ పార్లమెంట్ గా చేయడమే నాలక్ష్యం. మీరు సహకరించాలే గాని 5 కాదు 30 సంవత్సరాల పాటు మీతోనే ఉంటా” అని చెబుతూ.. విక్టరీ సింబల్ చూపించే తీరు గుంటూరు పార్లమెంట్ లోని ప్రతి నియిజకవర్గం వారిని అమితంగా ఆకట్టుకుంది.

తెల్లదొరలను గడగడ లాడించిన అల్లూరి సీతారామరాజు గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ లపై దాడి చేసే ముందు చెప్పిమరీ చేసేవాడని. అలాగే మన డాక్టర్ చెప్పిమరీ చేసే రకం. “నా లక్ష్యం.. లక్ష ఉద్యోగాల కల్పన” అని 100% కాన్ఫిడెన్స్ తో చెప్పారు. ఒక విప్లవ వీరుడి వలె ఉద్యోగాల కల్పన చేయగల సమర్థుడు మరియు మేధావి మన డాక్టర్. తన లక్ష్యం గురించి చెప్పేటప్పుడు ఆయనలోని కాన్ఫిడెన్స్ ను గమనించిన యువతలో ఉత్సాహం ఉరకలేయకుండా ఉంటుందా..!?

2019 నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగం అంటే వాలంటీర్ అనే లా.. వైసీపీ పాలకులు చేశారు. 5-6 వేల జీతాలే గొప్ప అనేవిధంగా మాట్లాడుతున్నారు. వైసీపీ తీరుతో మసకబారుతూ, తమ భవిష్యత్తు చీకటిలో వెళ్లిపోతుందన్న ఆందోళనలో ఉన్న మన యువతకు డాక్టర్ పెమ్మసాని ఇచ్చిన భరోసా బూస్ట్ లాంటిది.

మన యువతకు డాక్టర్ చంద్రశేఖర్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. పెమ్మసాని గెలుపుతో.. ప్రశ్నార్థకంగా మారిన తమ భవిష్యత్తుకు ఇక దిగులు చెందే అవసరం లేదనే భావనతో.. యువతలో నూతనోత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని కలిగించాయి.

ప్రపంచ మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు, విజనరీ చంద్రన్నతో మన యువకెరటం నారా లోకేష్ తో.. మా చంద్రశేఖరుడు అడుగుతో అడుగు కలిపి అందిన అవకాశాలను ఒడిసి పట్టుకొగల సమర్ధుడు.

జగన్ రెడ్డి విధ్వంసకర పోకడలతో, అనాలోచిత నిర్ణయాలతో, అసమర్థ పాలనతో.. ఆంధ్రరాష్ట్ర యువతను మానసిక వికలాంగులుగా మార్చిన సంగతి మనకు తెలిసినదే. అలాంటి వారికి వైద్య భాషలో చెప్పాలంటే “వైద్యం చేసేందుకు”, మన భాషలో చెప్పాలంటే “ఉపాధి అవకాశాలను కల్పించేందుకు” దీర్ఘకాలిక ప్రణాళికతో సంసిద్ధమై వచ్చారు డాక్టర్ చంద్రశేఖర్.

ఉన్నత విద్యావంతుడైన నాయకుడుకి సమస్యలపై అవగాహన ఉంటుంది. సమస్యలను పరిష్కరించే ఆలోచనా శక్తి ఉంటుంది. తన నోటిమాటతో ఆచరింపచేసే కార్యవర్గం ఉంటుంది. దానికి తగ్గ ప్రణాళికలు ఉంటాయి. అటువంటి నాయకుడే.. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న డా.చంద్రశేఖర్ కు బడుగు బలహీనవర్గాల సన్నిహిత్యంతో వారి పరిస్థితులు, కష్టాలు తెలుసు. గుంటూరు కారంతో పచ్చడి మెతుకుల విలువ తెలుసు. బిస్కెట్స్ & గ్రేవీ, గ్రిల్డ్ చీజ్, పిజ్జా వంటి రుచులు తెలుసు. గంజి బలము తెలుసు బెంజి సుఖము తెలుసు. కటిక పేదరికంతో మగ్గే వారి బాధ తెలుసు. పేదరికాన్ని జయించడం తెలుసు, జయింపజేయడం తెలుసు. అవకాశాలను అందిపుచ్చుకోవడం తెలుసు, అందిపుచ్చుకున్న అవకాశాలతో అద్భుతాలను సృష్టించడం తెలుసు.

ఇలాంటి వాస్తవిక పరిస్థితులను, విషయాలను తెలుసుకున్న ప్రజలు, యువత మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పట్ల ఆకర్షితులవుతుండడంలో ఆశ్చర్యం లేదనుకుంటా..!?

– అబ్దుల్ గఫూర్