వీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్

చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుప్పం నియోజకవర్గం ఇంఛార్జ్ భరత్ వివాదంలో చిక్కుకున్నారు. స్మగ్లింగ్ , హత్యలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీలోని కాకర్లవంకలో కొందరు వ్యక్తులు దీనిని నిర్మించారు.

స్మారకంపై వీరప్పన్ చిత్రపటంతోపాటు జెండాను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భరత్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించి…. శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, రెస్కో వైస్‌ఛైర్మన్‌ కోదండరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కుప్పం నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా భరత్‌ను సీఎం జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు భరత్‌ను గెలిపిస్తే.. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. మంత్రిని కూడా చేస్తానన్నారు. వీరప్పన్ స్మారకాన్ని ఎమ్మెల్సీ ఆవిష్కరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.