ఓటమి భయంతో జగన్ పోలీసులతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు

నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారన్న విషయం తెలిసిందే. దీనిపై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్ టిడిపి నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పాడు.

జగన్ నియంతృత్వ పోకడలను భరించలేక ఇటీవల నెల్లూరు జిల్లా సీనియర్ నేతలు టీడీపీలోకి వస్తున్నారని, ఈ పరిణామాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని అన్నారు. మాజీమంత్రి నారాయణ అనుచరులైన విజితారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మంల ఇళ్లకు పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేశ్ ఆరోపించారు.

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ కు ముందే ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అరాచకపర్వానికి తెరలేపిన నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకులను పంపించాలి. అవసరమైతే కేంద్రబలగాలను రంగంలోకి దించాల్సిందిగా కోరుతున్నాను.