బీజేపీ ఎంపీ అభ్యర్ధులు ఖరారు

– రాజమండ్రి నుంచి పురందేశ్వరి
– హిందూపురం నుంచి సత్యకుమార్
– ఏలూరు నుంచి సుజనా చౌదరి
– అనకాపల్లి నుంచి సీఎం రమేష్
– అరకు నుంచి కొత్తపల్లి గీత
– రాజంపేట నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి
– బీజేపీకి పెరిగిన అసెంబ్లీ సీట్లు
– 6 నుంచి 9 లేదా 10 అసెంబ్లీ సీట్లు?
– జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లు కేటాయింపు?
– నర్సాపురం టీడీపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజు ఖరారు
– రాజును వ్యూహాత్మకంగా తప్పించిన బీజేపీ రాష్ట్ర పెద్దలు?
– వైసీపీతో పరోక్ష అనుబంధంపై అనుమానాలు
– రాజుకు సీటు ఆలస్యంపై కూటమికి సోషల్‌మీడియాలో వెక్కిరింపులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-బీజేపీ పొత్తులో బీజేపీకి కేటాయించిన 5 లోక్‌సభ అభర్థుల ఎంపిక పూర్తయింది. ఆ మేరకు ఐదుగురు అభ్యర్ధుల ఎంపిక ఇక లాంఛనమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ బరిలో దిగనున్నారు. అయితే జనసేన కోటాలో ఒక ఎంపీ సీటును బీజేపీ తీసుకున్నట్లు సమాచారం. బహుశా సోమవారం లేదా మంగళవారం బీజేపీ నాయకత్వం, వారి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీకి కేటాయించిన ఎంపీ సీట్లు దాదాపు ఖరారరయ్యాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, హిందూపురం నుంచి సత్యకుమార్, ఏలూరు నుంచి సుజనాచౌదరి, రాజంపేట నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ , అరకు నుంచి కొత్తపల్లి గీత పేర్లు ఖరారయ్యాయి.

నిజానికి బీజేపీకి పొత్తులో టీడీపీ కేటాయించినది 5 లోక్‌సభ స్థానాలు మాత్రమే. అయితే జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ-3 లోక్‌సభ కోటా నుంచి.. బీజేపీ ఒక ఎంపీ, 3 లేదా 4 అసెంబ్లీ స్థానాలు తీసుకుని పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. టీడీపీ బీజేపీకి కేటాయించిన 6 అసెంబ్లీ స్థానాలతోపాటు, జనసేన కోటా నుంచి మరో నాలుగు తీసుకోవడం ద్వారా, మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఈ విషయంలో జనసేన దళపతి పవన్ కల్యాణ్ పొత్తు ప్రయోజనాల కోసం, మిత్రపక్షాల మధ్య విబేధాలు రాకుండా తన సీట్లను త్యాగం చేసినట్లు చెబుతున్నారు.

ఇక తొలి నుంచీ ఉత్కంఠ రేపిన.. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ వ్యవహారం కూడా కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతారని భావించారు. అయితే పొత్తులో భాగంగా అదే ఉమ్మడి జిల్లాలోని ఏలూరు స్థానం నుంచి సుజనాచౌదరిని రంగంలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దానితో ఒకే జిల్లాలో రెండు ఎంపీ సీట్లు.. ఒకే పార్టీకి ఇవ్వడం సాధ్యం కానందున, రఘురామకృష్ణంరాజు టీడీపీ అభ్యర్ధిగా నర్సాపురం బరిలో దిగనున్నట్లు సమాచారం.

అయితే రఘురామకృష్ణంరాజుకు బీజేపీ టికెట్ రాకుండా, ఆ పార్టీలోని అగ్రనేతలు అడ్డుచక్రం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి రాజంపేటలో విఫలమైన బీజేపీ రాష్ట్ర అగ్రనేతల వ్యూహం, నర్సాపురంలో మాత్రం సక్సెస్ అయిందని చెబుతున్నారు. దీన్నిబట్టి పొత్తు కుదిరినా కొందరు అగ్రనేతలకు, వైసీపీతో పరోక్ష అనుబంధం పోయినట్లు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్‌మీడియాలో రాజు అభిమానులు.. బీజేపీ, కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

‘అసలు జగన్‌పై మొదట యుద్ధం ప్రకటించిందే రాజు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పోగు చేసిందే ఆయన. చావు నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రాణాలకు తెగించి జగన్‌పై యుద్ధం చేసిన రాజు తర్వాతనే చాలామంది బయటకొచ్చారు. జగన్‌పై పోరాటానికి ఆయనే స్పూర్తి. అలాంటి ఆయనకు టికెట్ ప్రకటించేందుకు కూటమి ఆలస్యం చేయడమే ఆశ్చర్యంగా ఉంది. బీజేపీలో రాజుకు టికెట్ రాకుండా చేస్తారని మాకు ముందే తెలుసు. ఏదేమైనా ఆలస్యమైనా మంచే జరిగింది. ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడమే సరైంది’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.