కంచాలు మోగించండి.. ఉప్మాలు తెచ్చుకోండి!

– ‘ముద్రన్న’.. జగనన్న దగ్గరకెళుతున్నాహో…

( మార్తి సుబ్రహ్మణ్యం)

కాపుజాతిపిత.. కాపురత్న.. కాపుకులశేఖర .. కిర్లంపూడి కాపుపీఠాథిపతి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభం గారు.. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిగారి దివ్యసముఖంలో, ఈనెల 14న తాడేపల్లిలోని జగన్మోహన్‌రెడ్డి స్వగృహంలో వైసీపీ తీర్ధం తీసుకుని జగన్‌గారి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాపుజాతి కదలివచ్చి తాడేపల్లిని తరింపచేసి, మీరు తెచ్చుకునే ఉప్మా తిని, మేము మోగించే కంచాల విజయధ్వనులు విని ఆనందించాల్సిందిగా ప్ధ్రార్ధన. గమనిక: తాడేపల్లికి వచ్చే కాపుపీఠాథిపతి భక్తులు తలాఒక కంచం తీసుకురాగలరు. ఉప్మాకూడా మీరే తెచ్చుకోగలరు.- ఇట్లు కిర్లంపూడి కాపు పీఠం ఆశ్రమ యాజమాన్యం
* * *
గత రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో ఇలాంటి పిలుపులే సర్వత్రా దర్శనమిస్తున్నాయి.భాజాభజంత్రీల శబ్దాలే వినిపిస్తున్నాయి. కారణం.. అవన్నీ కాపుజాతిపిత ముద్రగడ పద్మనాభం సకుటుంబ సపరివార సమేతంగా వైసీపీ కండువా కప్పేసుకునే శుభముహుర్తానికి సంబంధించిన మంగళవాద్యాలట. ‘కాపు రిజర్వేషన్లు ఇచ్చేసిన’ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతగా, వైసీపీలో చేరుతున్న ముద్రగడకు మద్దతుగా.. కాపు జాతి యావత్తూ తాడేపల్లికి తండోపతండాలుగా తరలివచ్చి, రోడ్డుకు ఇరువైపులా వందలకిలోమీటర్ల వరకూ బారులుతీరి నిలబడి, కంచాలతో జయజయధ్వానాలు మోగించే శుభవేళకు సంబంధించిన లోకోత్తర దృశ్యకావ్యమట.

నిన్నటివరకూ జనసేనాధిపతి, సాటి కులస్తుడైన పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలి? కమ్మ కులస్తుడైన చంద్రబాబును సీఎం చేయడానికి కాదు కదా జనసేన పొత్తు? రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉండాల్సిందే! కమ్మవారిని యాచించడం ఏమిటి? ఇలాంటి రెండు, మూడు డజన్ల లెటర్‌హెడ్లను తమ ప్రశ్నలతో ఖాళీ చేసిన మరో కాపుజాతి మహనీయుడు చేగొండి హరిరామయ్య కూడా ముసుగుతీసి, జగన్మోహన్‌రెడ్డి గారి దివ్య సముఖంలో, కొడుకును వైసీపీలో చేర్పించడంతో జనసేనకు ఒక గండం తప్పింది.

ఇక మిగిలింది కాపుజాతిపిత ముద్రగడ ఒక్కరే. ముద్రగడ అంటే ముందు గుర్తుకొచ్చేది ఆత్మగౌరవం. ఆ తర్వాత కిర్లంపూడి. ఆ తర్వాత ఆయనతో ఉండే నలుగురైదుగురు ఆస్థాన విద్వాంసులు. ఆ తర్వాత గుర్తుకువచ్చేది నోరూరించే నాన్‌వెజ్ వంటకాలతో ఆయన ఆతిథ్యం! ఎవరైనా ముద్రగడతో చర్చించాలంటే కిర్లంపూడికి వెళ్లాల్సిందే తప్ప, ఆయన బయటకు రారు. ఎంత లావు మొనగాడైనా ఆయన కాపుపీఠానికి వెళ్లి, కాపుస్వామీజీతో ముచ్చటించి ఉప్మా తినిరాలసిందే.

పవన్ అంతటి వాడే కిర్లంపూడి పీఠానికి వస్తానని చెప్పి, రాకపోవడం స్వామీజీని మనస్తాపానికి గురిచేసిందట. దానితో హర్టయిన ముద్రగడ స్వామీజీ, కాపు పార్టీని కాదని రెడ్ల పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట. దానితో జనసేనకు గండం గడిచి పిండం బయటపడినట్లయింది. ‘నాకు తిక్కుంది. దానికో లెక్కుంది’ అని సినిమాలో డైలాగులు చెిప్పిన పవన్‌కు, నిజంగానే ఈ ‘స్వయంప్రకటిత కులగురువు’లపై ఒక లెక్కుందనిపిస్తోంది.

అంటే ఇక పవన్‌కు ప్రశ్నలతో ముంచెత్తే ముసుగువీరుల బెడద తప్పినట్లేనన్నది కాపునేతల వాక్కు. ఆ లెక్కన పవన్‌కు రాజకీయ ‘స్వయంప్రకటిత రాజగురువులు’ లేనట్లే! మరిప్పటివరకూ పవన్‌కు ముద్రగడ చేసిన హితబోధలు ఏమైనట్లు? కాపురిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాలు, మోగించిన కంచాలు ఎక్కడికి పోయినట్లు? అని ప్రశ్నించినవాడు కాపు ద్రోహి కిందే లెక్క.

సరే జాపుజాతిపిత ముద్రగడ.. మిథున్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వంటి రెడ్డిగార్ల ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నారు బాగానే ఉంది. ముద్రగడ దృష్టిలో టీడీపీ అంటే ఇప్పటిదాకా కమ్మపార్టీ. మరి రేపు 14న ఆయన చేరబోయే వైసీపీ ఏమైనా బీసీల పార్టీనా? కాదు. అది రెడ్ల పార్టీనే కదా? పోనీ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించిన పెద్దరెడ్లు ఏమైనా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేస్తామని హామీ ఏమైనా ఇచ్చారా? వీటికి సమాధానం చె ప్పాల్సింది కిర్లంపూడి కాపుపీఠాథిపతినే.

అసలుతాను కాపు రిజర్వేషన్లకు బద్ధ వ్యతిరేకినని నిర్మొహమాటం- నిర్భీతిగా చెప్పిన జగన్మోహన్‌రెడ్డి పార్టీలో.. అదే రిజర్వేషన్ల కోసం కంచాలు మోగించి, ఉప్మాలు పెట్టించిన కాపుజాతిరత్నం ముద్రగడ, ఏ అజెండాతో వైసీపీలో చేరుతున్నారు? తాను కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన ముద్రగడ, ఇప్పుడు ఏ హోదా-ఏ లెటర్‌హెడ్‌తో వైసీపీలో చేరుతున్నారు?

మామూలు మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఏ పార్టీలో చేరినా ఎవరికీ పట్టింపు ఉండదు. కానీ కాపునేత హోదాలో వెళితేనే గత్తర. కాపు ఉద్యమానికి దూరమైన ముద్రగడ, ఆ హూదాలో వైసీపీలో చేరితే.. కాపు రిజర్వేషన్లపై జగన్మూహన్‌రెడ్డికి ఏమైనా షరతు విధించారా? అన్న ప్రశ్న మెడపై తల ఉన్న ఏ జాతికయినా వచ్చి తీరాలి.

కాపు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని నిస్సంకోచంగా చెప్పి, ఆ మాటకే కట్టుబడ్డ జగన్మోహన్‌రెడ్డి గొప్పవాడా? రిజర్వేషన్ల కోసం పోరాడి, చివరాఖరకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పిన అదే జగన్మోహర్‌రెడ్డి వద్దకు వెళ్లి, మెడ వంచి వైసీపీ కండువా కప్పేసుకోబోతున్న ముద్రగడ గొప్పవాడా? ఇద్దరిలో ఎవరి కమిట్‌మెంట్ గొప్పది? ఇందులో రణం చేసేవారెవరు? రాజీ పడేది ఎవరు? అన్నది కాపుజాతిలో మొదలయిన చర్చ.

వైసీపీలో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్లకు దిక్కులేదు. ఎంతలావు మొనగాడైనా సరే.. తాడేపల్లికి వెళితే సజ్జల, ధనుంజయరెడ్డి ధర్మదర్శనంతో తృప్తి చెందాల్సిందే. బయటయితే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డితో మాట్లాడి బయటపడాల్సిందే. ఇది బహిరంగ రహస్యం కాదు. బహిరంగ సత్యమే.
అలాంటిది తనది సీఎం స్థాయి.. ఎవరైనా సరే తనదగ్గరకు రావలసిందే. తాను కాపుజాతిబాంధవుడనని భావించే ముక్కోపి ముద్రగడ.. అంతమంది పెద్ద రెడ్ల దగ్గర ఎంతోకాలం ఇమడలేరన్నది కాపునేతల అంచనా.

ఆత్మగౌరవానికి పెద్దపీట వేసే ముద్రగడ లాంటి నేతలు.. అది ఇసుమంతయినా ఇవ్వని జగనన్న దగ్గర, ఎన్నాళ్లు మనుగడ సాగిస్తారో చూడాలన్నది కాపు నేతల ఉవాచ. తమకు తెలిసి ముద్రగడ జేబులో మరొక‘ విడుదల చేయని లేఖ’ ఈపాటికే సిద్ధమై ఉండాలని, ఆయన సన్నిహితులు భవిష్యవాణి వినిపిస్తున్నారు.

పోనీ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడయినా కాపు రిజర్వేషన్లు ప్రకటించమని ముద్రగడ ఏమైనా జగన్‌ను డిమాండ్ చేస్తారా? ఆ మేరకు ఆయన నుంచి ప్రకటన వచ్చేలా చేయగల శక్తి ముద్రగడకు ఉందా? పీఆర్‌సీ మాదిరిగా కాపు రిజర్వేషన్లపై గతంలో తెలియక ప్రకటన చేశామని, ఇప్పుడే రిజర్వేషన్లు ఇస్తున్నట్లు జగన్మోహన్‌పై ఒత్తిడి చేసి, ఆయన నోటి నుంచే ఆ ప్రకటన వచ్చేలా చేస్తేనే కదా… ముద్రగడ చేరికకు అర్ధం! కాపు రిజర్వేషన్లు ప్రకటిస్తేనే కండువా వేసుకుంటా లేదంటే కంచాలు మోగిస్తానని తన స్టైల్లో చెబితేనే కదా ముద్రగడ చేరికకు పరమార్ధం? లేకపోతే లొంగుబాటే కదా అన్నది కాపుజాతి భావన.

కానీ ఇదంతా ముద్రగడపై జరుగుతున్న దుష్ప్రచారమేనని.. 14న జగనన్నను కలిసే సందర్భంలో, ‘‘కాపు రిజర్వేషన్లు ప్రకటిస్తేనే తాను వైసీపీ కండువా వేసుకుంటానండి. లేకపోతే నా జాతిని మీకు తాకట్టుపెట్టలేనండి. అయ్యా దయచేసి ఏమీ అనుకోవద్దండి’’ అని ముద్రగడ తనదైన శైలిలో జగనన్నకు ముందు నిర్మొహమాటంగా చెబుతార న్నది ఆయన అభిమానుల ప్రగాఢ నమ్మకం. చూడాలి అభిమానుల నమ్మకం గెలుస్తుందో? పార్టీపై మనుసులోని ప్రేమ గెలుస్తుందో?!

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్నది ముతకసామెత. ఉద్యమాల్లో తిరుగుబాటు ఉండదు. లొంగుబాటు మాత్రమే ఉంటుందన్నది ఇప్పటి నయా సామెత. మార్పు కోసం పాలకులపై తుపాకులతో తిరుగుబాటు చేసి, తర్వాత లొంగిపోయే విప్లవమూర్తులను చూశాం. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం పోరాడి, పాలకులకు లొంగిపోయే ఉద్యమమూర్తులను చూస్తున్నాం. సందర్భాలే వేరు. మిగిలినదంతా షేమ్ టు షేమ్!