మహిళలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

మహిళల సంతోషం
ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు
సీఎం రేవంత్ హామీ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో స్వశక్తి మహిళా సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్వయం ఉపాధి కేంద్రాలతో మహిళలు రాణిస్తున్న తీరును సీఎం అభినందించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్స్ లో ప్రదర్శించారు. ఒక్కొక్క స్టాల్ ను సందర్శిస్తూ, ఉత్పత్తులకు సంబంధించి మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తున్న తీరుపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మహిళలను మరింతగా ప్రోత్సహించి వారిని కోటీశ్వరులను చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. స్వశక్తి మహిళా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన పది స్టాళ్లలో బంజారా ఉత్పత్తులు, సిషల్ ఆర్టికల్స్, నకాషి పెయింటింగ్స్, డర్రిస్, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్కూల్ యూనిఫామ్స్, టస్సార్ సారీస్, హ్యాండ్లూమ్స్, టై అండ్ డై క్లాత్స్, గొల్లభామ చీరలు, లెథర్ ఉత్పత్తులు, చెక్కబొమ్మల ఉత్పత్తులు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, పెంబర్తి బ్రాస్, మిల్లెట్ ఉత్పత్తులు, digi పే పాయింట్, VLE పాయింట్, పశుమిత్ర, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఉడ్ క్రాఫ్ట్స్, హోమ్ ఫుడ్స్ కు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. స్వయం ఉపాధితో పేదరికం నుంచి లక్షాధికారులుగా మారిన మహిళల స్పూర్తిని సీఎం అభినందించారు. మహిళల ఆదాయాన్ని పేంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.