మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!

-చేనేతలకు కొత్త మగ్గాలు, మార్కెట్ సదుపాయం
-చేనేత సొసైటీల ప్రతినిధులతో భేటీలో నారా లోకేష్

అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఒడిదుడుకుల్లో ఉన్న చేనేత రంగానికి చేయూతనిస్తాం. ఇప్పటికే మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటుచేసి ఉపాధి కల్పించడం జరిగింది. టాటా తనేరియాతో ఒప్పందం కుదుర్చుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాం. సరికొత్త డిజైన్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చాక చేనేతకు సబ్సీడీలు ఇచ్చి ప్రోత్సహిస్తాం. కొత్త మగ్గాలను తీసుకువచ్చి మార్కెట్ సదుపాయాలను పెంచుతాం. కేంద్రంతో మాట్లాడి చేనేత రంగంపై జీఎస్టీ లేకుండా చేస్తాం. చేనేతలను ప్రైవేటు కంపెనీలతో అనుసంధానించి అవకాశాలను విస్తృతపరుస్తాం. ఆప్కోపై ఆధారపడకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. యువగళం పాదయాత్ర సమయంలో ధర్మవరం, వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశా. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాల పై నాకు పూర్తి అవగాహన ఉంది. మగ్గాలను అప్ గ్రేడ్ చేసి మెరుగైన కొత్త డిజైన్లు తీసుకువస్తాం. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి వివాదాన్ని పరిష్కరిస్తామని తెలిపారు.

అభివృద్ధిలో వ్యాపారులదీ కీలకపాత్రే
రాష్ట్రాభివద్ధి, ఉద్యోగాల కల్పనలో వ్యాపారులు, రిటైల్ వ్యాపారలదీ కీలకపాత్రే. మన ప్రభుత్వం వచ్చాక మీరు అడిగినవి చేస్తాను…కానీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని తీసుకువస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో వ్యాపారులతో జరిగిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు సేవ చేయాలన్న కసి, పట్టుదలతోనే మంగళగిరి ప్రజలను అంటిపెట్టుకుని సొంత నిధులతో సేవలందిస్తున్నానని యువనేత లోకేష్ చెప్పారు. అభివృద్ధి చేయాలనే తపన నాలో ఉంది. మంగళగిరిలో పుట్టి పెరగకపోయినా…సొంత ఊరులా భావించే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. మంగళగిరి ప్రజలకు శక్తివంచన లేకుండా సేవ చేస్తానన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ…. చెత్తపన్ను చెల్లించకపోతే చెత్త తీసుకెళ్లడం లేదని, హోటళ్ల నుండి నెలకు రూ.3వేల చెత్త పన్నులు వసూలు చేస్తున్నారు, దూరప్రాంతాల నుంచి వచ్చే సరుకురవాణా వాహనాల నుంచి ఆశీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యాపారస్తుల పై పన్ను భారం తగ్గిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

రోటరీ సామాజిక సేవ ప్రశంనీయం
సామాజిక సేవలో రోటరీ క్లబ్ సంస్థ సేవలు ప్రశంసనీయమని యువనేత నారా లోకేష్ కొనియాడారు. ఉండవల్లి నివాసంలో మంగళగిరి, తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. 2నెలల్లో ప్రజాప్రభుత్వం వచ్చాక రోటరీలాంటి స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. క్యాన్సర్ పరీక్షల కోసం స్క్రీనింగ్ నిర్వహించే సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని ప్రతినిధులు కోరగా, బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ నుంచి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో నాలుగేళ్ల పది నెలలుగా నా పనితీరును చూశారు. పేదరికం లేని మంగళగిరిని చూడటమే నా లక్ష్యం. అందరం కలిసి సంకల్పంతో మంగళగిరిని అభివృద్ధి చేద్దాం. నేను, పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి డబుల్ ఇంజన్ లా పనిచేస్తాం. భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో గుంటూరు పార్లమెంట్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.