సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

-సాగునీరందక రైతుల ఇక్కట్లు
-రుణమాఫీ అమలు చేయకుండా మోసం
-రూ.7 వేల కోట్ల రైతుబంధు నిధులు ఏమయ్యాయి?
-ఆర్‌ ట్యాక్స్‌, బీ ట్యాక్స్‌ల కోసమే ఖర్చా?
-బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలతో రైతులు చేతికొచ్చిన పంట కళ్ల ముందు ఎండిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి ఉందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అమలు చేయలేద న్నారు. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు రైతుబంధు కోసం కేటాయించి రైతుల అకౌంట్లలో జమ చేయాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌తో ఆగిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాటిని దారిమ ళ్లించిందని, అవి ఎటుపోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 13 వారాల్లో రూ.13 వేల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చింది. బాండ్లను ఓపెన్‌ మార్కెట్‌లో అమ్మి మరో నాలుగు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. వాటిని కేవలం ఆర్‌ ట్యాక్స్‌ (రాహుల్‌ ట్యాక్స్‌), బీ ట్యాక్స్‌ (బిల్స్‌ పెండిరగ్‌ ట్యాక్స్‌)ల కోసం మాత్రమే ఖర్చు పెడుతోందని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాపీ, రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్‌ చేస్తే 9 శాతం కమీషన్లు వస్తాయని టోల్‌ గేట్ల వద్ద బీ ట్యాక్స్‌.. ఆర్‌ ట్యాక్స్‌ రూపంలో వసూలు చేస్తోంది తప్పితే రైతులు, ప్రజల కోసం ఆలోచన చేయడం లేదని విమర్శించారు. పాలనపై, నీటి నిర్వహణపై నియంత్రణ లేని అధ్వాన పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. చాలాచోట్ల పంట పొట్టకొచ్చిన దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు ఉత్తర తెలంగాణను విస్మరించి ఎస్సారెస్పీలో 8 టీఎంసీల నీటిని నిర్ధాక్షిణ్యంగా దోచుకుని మరో ప్రాంతానికి తీసుకుకెళ్లారని, ప్రభుత్వం సరస్వతి కెనాల్‌ ద్వారా 6 టీఎంసీల నీరు కేటా యిస్తే కేవలం నాలుగున్నర టీఎంసీలు మాత్రమే ఇచ్చారు.. ఇదేనా వాటర్‌ మేనేజ్‌మెంట్‌..? అని ప్రశ్నించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రైతులకు నష్టపరిహారం కోసం రూ.20 వేలు డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. సీఎంగా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. అవికూడా ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదన్నారు. కమీషన్లు రావనే దురుద్దేశంతోనే రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదు. నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున భృతి ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్వీ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.