సుప్రీం కోర్టుకు రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు

తుప్పదారి పట్టించే అడ్వర్టైజ్‌మెంట్ కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు.

పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం పతంజలి ఆయుర్వేదకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1 కోటి జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషిన్‌లో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆ తరువాత కూడా ప్రకటనలు కొనసాగడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

గతంలో ఇచ్చిన తీర్పును అమలు పరచనందుకు వారిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో చెప్పిన క్షమాపణలు అసంపూర్తిగా ఉన్నాయని, నిజాయతీ లోపించిందని వ్యాఖ్యానించిన కోర్టు చివరి అవకాశం ఇస్తున్నట్టు ఏప్రిల్ 2 నాటి తీర్పులో పేర్కొంది.

ఈ క్రమంలో రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘జరిగిన పొరపాటుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానీయనని మాటిస్తున్నాను. కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగినందుకు బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని రామ్‌దేవ్ బాబా అఫిడవిట్ దాఖలు చేశారు.