చంద్రబాబు నాకు దైవంతో సమానం

-అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లా
-పొత్తు కోసం పవన్ కల్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు
-నాగబాబు టికెట్ ను కూడా పొత్తు కోసం త్యాగం చేశారు
-మూడు పార్టీల సమావేశంలో విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

విజయవాడ : దివంగత అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లానని రాజ్యసభ మాజీ సభ్యుడు, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తనకు ప్రాంతీయ పార్టీలు సెట్ కావని, జాతీయ పార్టీలోకి వెళ్లాలని ఉందని జైట్లీతో చెప్పానని… దాంతో, ఆయన బీజేపీలోకి రమ్మన్నారని తెలిపారు. జాతీయ పార్టీలో పని చేయాలనే కోరికతోనే బీజేపీలోకి వెళ్లానని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా… ఎప్పటికీ తనకు రాజకీయ గురువు చంద్రబాబేనని చెప్పారు. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారని… తనకు చంద్రబాబు దైవంతో సమానమని అన్నారు.

విజయవాడ భవానీపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన మూడు పార్టీల సమావేశంలో మాట్లాడుతూ .. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పట్టువదల వదలని విక్రమార్కుడిలా పోరాడారని సుజనా చౌదరి కొనియాడారు. ఏపీ ప్రజల కోసం ఆయన త్యాగమూర్తిలా మారారని చెప్పారు. సొంత అన్నయ్య నాగబాబు టికెట్ ను కూడా పొత్తు కోసం త్యాగం చేశారని అన్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా స్పందిస్తూ… మహేశ్ ఏం మాట్లాడినా ఎవరూ స్పందించవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. ఆయన స్థాయికి మనం వెళ్లొద్దని, ఆయనను దుర్భాషలాడొద్దని, మన గ్రాఫ్ పెంచుకుంటూ పోదామని అన్నారు.