అమరావతి, మహానాడు : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం నివాళులర్పించారు. ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలు, అధికారంలో ప్రాధాన్యం కల్పించి బీసీల పార్టీగా అవతరించిందన్నారు. పూలే ఆశయాలతో ప్రేరణ పొంది వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలతో డిక్లరేషన్ ప్రకటించినట్లు చెప్పారు.
అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే రూ.4,000 పింఛన్, రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు తదితర కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడిరచారు. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి అందిస్తామని తెలిపారు. పెళ్లి కానుక లక్షకు పెంచి అమలు చేస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వే షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.