తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : రాష్ట్ర ప్రజలు, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమికి లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడం హర్షణీయమని జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్‌కు జయప్రకాశ్ నారాయణ స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదా లు తెలిపారు.
లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బాబ్జి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమికి మద్దతు తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి మత్తు రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్య త్తు కోసం రాజకీయాల్లో మార్పు రావడం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.