రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలం

రూ.2500 ఇస్తామని రూ.1530లకు కొంటున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా?
బీఆర్‌ఎస్‌ నాయకుల ధ్వజం

హైదరాబాద్‌, మహానాడు: రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయా లని, క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండిరచిన ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చి రూ.2500లకు కొంటామని రేవంత్‌రెడ్డి చెప్పినా మద్దతు ధర లేక క్వింటా రూ.1500 చొప్పున అమ్ము కుంటున్నారని విమర్శించారు. జనగామలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తే కొనుగోలు చేసింది 440 మెట్రిక్‌ టన్నులు మాత్రమేన న్నారు. మార్కెట్‌ యార్డ్‌కు 4 వేల మెట్రిక్‌ టన్నులు వస్తే అక్కడ కేవలం రూ.1530 మాత్రమే ఇస్తున్నారు. మద్దతు ధరకు రూ.700 తక్కువగా వ్యాపా రులు దళారులు కొంటున్నారని, సీఎం దృష్టికి వెళ్లినా అదనంగా రూ.30 మాత్రమే వచ్చిందన్నారు.

తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్టపోయిన మొత్తాన్ని వారి అకౌంట్లలో వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ పేరుతో సీఎం, మంత్రులు తప్పించుకోవాలనుకుంటే కుదరదని, వెంటనే రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.