చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు

వెలగపూడి, మహానాడు: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ నేత మల్లాది విష్ణు, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేశారు. మార్చి 11న అమలాపురం బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను అందజేశారు.

అదే సభలో పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణారెడ్డిలపై ఎన్నికల నియమావళికి విరుద్ధంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు చేశారు. దీనిపైనా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా రూపొందించిన ఓ పాట నారా లోకేష్‌ తన యూట్యూబ్‌ చానల్‌లో ప్రసారం చేసి బల్క్‌ వాయిస్‌ మెసేజ్‌ (ఐవీఆర్‌ ఎస్‌ విధానం) ద్వారా బల్క్‌ కాల్స్‌ పంపుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.