అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు, మహానాడు: దుగ్గిరాల మండలం పెదవడ్లపూడిలో కూటమి పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించారు. విద్యను నమ్ముకుంటే శిఖరాగ్రానికి చేరడం కష్టమేమీ కాదని అంబేద్కర్‌ నిరూపిం చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్‌ ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్‌ బాటను అనుసరించడం అంటే అది ఒక బాధ్యతాయుతంగా ముందుకుసాగి పదిమందికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. అనంతరం స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను ఆయన కలుసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు యాళ్ల శివరామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జువ్వాది కిరణ్‌ చంద్‌, బీజేపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ పాతూరి నాగభూషణం, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మాదల రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.