– సీఎం రేవంత్‌కు రైతుల హెచ్చరిక
– సిద్దిపేట నుంచి పోస్ట్ కార్డు ఉద్యమం
– వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
– హామీల అమలుకు ప్రజాస్వామ్య పంథాలో నిరసన
– బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రైతు నాయకుల మద్దతు
సిద్దిపేట, మహానాడు: సిద్దిపేట నుంచి మరో ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డు, సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, చిన్న కోడూర్ మండలం మార్కెట్ యార్డులో సోమవారం రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆవేదనను వివరిస్తూ పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన వరి ధాన్యానికి బోనస్ రూ.500, రైతు భరోసా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, రైతు రుణమాఫీ రెండు లక్షలు, రైతు బీమా, వర్షాలు లేక ఎండిపోయిన పంటలకు నష్టపరి హారం రూ.25 వేలు అమలు చేయాలని అందులో కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.