కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా?

మాజీ మంత్రి హరీష్‌రావు

గద్వాల, మహానాడు: కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా? అని మాజీ మంత్రి హరీష్‌ రావు సీఎం రేవంత్‌ను కోరారు. గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్‌ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డితో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి కష్టాలు వస్తాయని ప్రజలందరి కోసం ఈ దీక్ష చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలు దీక్షకు వచ్చి మద్దతు పలికారు. కర్నాటక లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. రేవంత్‌ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీలు తీసుకురావొచ్చు కదా? అని ప్రశ్నించారు. మరోవైపు రైతులు కేసీఆర్‌ వైపు చూస్తున్నారనే బీజేపీ దొంగదీక్షలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌ కుర్చీ కాపాడుకోవడానికి బీజేపీతో మిలాఖత్‌ అయ్యాడని, ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ మెడలు వంచి అమలు చేయించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ను గెలిపించాలని అభ్యర్థించారు.