శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలుశిక్ష

28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు
ఆయనతో సహా పదిమందికి శిక్ష ఖరారు
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న నేత
మండపేట, రామచంద్రాపురం ఎన్నికలపై ప్రభావం!
పోటీలో ఉంటారా? తప్పిస్తారా?

విశాఖపట్నం, మహానాడు : శిరోముండనం కేసులో కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఆయనకు 18 నెలల జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కూడా 18 నెలల జైలుశిక్ష విధించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 28 ఏళ్ల క్రితం 1996 డిసెంబర్‌ 29న ఈ ఘటన జరగ్గా ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేయటం అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు సహా మొత్తం పది మంది నిందితులుగా ఉన్నారు. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అటు ఆయన మండపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తుండటం, శిరోముండనం ఘటన రామచంద్రాపురం మండలంలో జరగటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి జైలుశిక్ష పడటంతో ఆయనను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పిస్తారా లేదా సుప్రీంకోర్టుకు అప్పీలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

తోట త్రిమూర్తులును పోటీ నుంచి తప్పించండి

సీఎంకు బహుజన ఐకాస నేత బాలకోటయ్య లేఖ

ఇద్దరు దళితుల శిరోముండనం కేసులో వైకాపా నాయకుడు తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు శిక్ష విధించటాన్ని స్వాగతిస్తున్నామని, నిందితుడు ఎన్ని కుట్రలు చేసినా, అంతిమంగా దళితుల ఆత్మగౌరవమే గెలిచిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తెలిపారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ఈ కేసులో నుంచి బయట పడేందుకు నిందితులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని, ఎస్సీలను క్రిష్టియన్‌ బీసీలుగా చూపించే ప్రయత్నాలు అధికారికంగానే జరిగాయన్నారు. బాధితుల ను భయపెట్టారని, ప్రలోభ పెట్టారని తెలిపారు. అయినా అంతిమంగా న్యాయమే విజయం సాధించిదని పేర్కొన్నారు. శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోటకు ఎమ్మెల్సీ ఇవ్వొదని చెప్పినా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని, కోర్టు తీర్పు నేపథ్యంలో మండపేట వైకాపా ఎమ్మెల్యే టికెట్‌ రద్ధు చేయాలని లేఖలో కోరారు. లేకపోతే తోట త్రిమూర్తులతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితులు ఎవరూ ఓట్లు వేయరని హెచ్చరించారు.