జగన్‌ పాలనలో ఆదాయం నిల్‌…అప్పులు ఫుల్‌

రూ.13 లక్షల కోట్ల అప్పులు
తలసరి అప్పు రూ.7 లక్షలు
పక్క రాష్ట్రాలత పోలిస్తే ఖర్చులు ఎక్కువ
ఆయన కుటుంబం క్షేమం..ప్రజలకు క్షామం
ఇంటికి పంపకుంటే భవిష్యత్తు అంథకారమే
రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విజయవాడ, మహానాడు : జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజల కుటుంబ ఖర్చుల మేరకు సంపాదన లేక ఆదాయం డల్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఫుల్‌గా చేయక తప్పని పరిస్థితి దాపురించిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు. విజయవాడలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిరచారు. రాష్ట్రంలో ప్రజలు పొదుపు చేసి కుటుంబం కోసం స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేసే పరిస్థితి లేక కుటుంబాల అభివృద్ధి నిల్‌ అయిందని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు తరలిపోతే ప్రజలకు ఉపాధి ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు దేశంలోనే అత్యధికం అయినప్పుడు, ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి అయినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి కోల్పోవడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి కరువైనప్పుడు, మరో వంక ఖర్చుల భారంతో కుటుంబాల బతుకు బండిని నడపడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉందన్నారు. జగన్‌ పాలనలో వైఫల్యం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో మధ్య తరగతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి నెత్తి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి రూ.7 లక్షల పైనే అప్పుల భారం ఉందన్నారు. జగన్‌ అసమర్థ పాలన వల్ల అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రాన్ని రూ.13.50 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని, పరోక్షంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నెత్తిపై రూ.2 లక్షలు పైగా అప్పు రుద్దారని విమర్శించారు. మధ్యతరగతి ప్రజలు ఆదాయం చాలక అంటే సంవత్సరానికి తలసరి ఒక లక్ష చొప్పున గడచిన ఐదేళ్లలో ప్రత్యక్షంగా సగటున ప్రతి వ్యక్తి 5 లక్షలు అప్పు చేయక తప్పని పరిస్థితిని జగన్‌ సృష్టించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజల ఆదాయం పడిపోవటానికి కారణం

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడం వల్ల యువత అర్హతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక పోవడం వల్ల ఏదో ఒక ఉద్యోగం చేయడం వల్ల రావాల్సిన వేతనాలు రావడం లేదు. రాష్ట్రంలో జగన్‌ నేతృత్వంలోని వైకాపా ప్రజాప్రతినిధుల తీరుతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదు. అనుభవజ్ఞులైన ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేక అనుభవానికి తగిన జీతాలు రావటం లేదన్నారు. ప్రజలకు ప్రత్యమ్నాయ మార్గాలలో అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండటం ఆదాయం పడిపోవటానికి కారణాలన్నారు. ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పరచిన సమాచారం మేరకు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2.19 లక్షలు అంటే దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల (తమిళనాడు : రూ.2.76 లక్షలు, కర్ణాటక : రూ.3.02 లక్షలు, తెలంగాణ : రూ.3.12 లక్షలు, కేరళ : రూ.2.34 లక్షలు) కన్నా చాలా తక్కువన్నారు.

ప్రజల అప్పులు పెరగటానికి కారణం

రాష్ట్రంలో ప్రజల కుటుంబాలకు అయ్యే ఖర్చులు దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో పోల్చినప్పుడు తెలంగాణతో పాటు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఆర్బీఐ నివేదికలోని గణాం కాల మేరకు 2022 – 23 సంవత్సరానికి ద్రవ్యోల్బణం తెలంగాణ 8.6 శాతం ఉంటే మన రాష్ట్రంలో 7.6 శాతం ఉంది (తెలంగాణ తలసరి ఆదాయం చాల ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ప్రభావం తక్కువ). ఇది దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల (తమిళనాడు : 6 శాతం, కర్ణాటక : 5.5 శాతం, కేరళ : 5.8 శాతం) కన్నా చాలా ఎక్కువ అని వివరించారు. ఆర్బీఐ నివేదికలోని గణాంకాల మేరకు వినియోగదారుల ధరల సూచి 2022 – 23 ప్రకారం ఆహార వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం తెలంగాణ 7.4 శాతం ఉంటే మన రాష్ట్రంలో 6.7 శాతం ఉంది (తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే ప్రభావం తక్కువ), ఇది దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల (తమిళనాడు: 4.8 శాతం, కర్ణాటక: 6.1 శాతం, కేరళ: 4.2 శాతం) కన్నా చాలా ఎక్కువని తెలిపారు.

ప్రజలపై భారం… ఖర్చులు ఎక్కువ

ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం ఆహార వస్తువులు, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చు ఎక్కువని ఇందుకు కారణాలు ఉన్నాయన్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, రాష్ట్రంలో తొమ్మిది సార్లు పెంచిన విద్యుత్‌ చార్జీల ప్రభావం, కేవలం కుటుంబంలోని వ్యక్తుల ప్రయాణ ఖర్చు, కుటుంబ విద్యుత్‌ వినియోగం భారం మాత్రమే కాకుండా రాష్ట్రంలో తయారు అయ్యే ప్రతి వస్తువు, సేవల వినియోగంపైన భారం కూడా ప్రజలు మోయవలసి వస్తుందని తెలిపారు. ఈ మొత్తం వ్యయం భారం దేశంలోనే మన రాష్ట్రంలోని ప్రజలు అత్యధికంగా మోయాల్సి వస్తుందని వివరించారు.

తలసరి అప్పు రూ.7 లక్షలు

రాష్ట్రంలో తలసరి ఆదాయం నెలకు రూ.18,250 కుటుంబాలకు అయ్యే ఖర్చులతో పోలిస్తే ఏ మూలకు సరిపోవడం లేదు. గడచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వాన పాలన వల్ల రోజువారీ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరిగి ఈ ఆదాయం చాలడం లేదని వెల్లడిరచారు. ఇది కాక రాష్ట్రంలో కుటుంబాలకు ఇంటి అద్దె లేదా హౌసింగ్‌ లోన్‌ వాయిదాలు, పిల్లల చదువులు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు వంటి ఇతర అవసరాలు కలిపి చూస్తే సగటున నెలకు కనీసం మరో రూ 9 వేలు అదనంగా ప్రతి వ్యక్తికీ అవసరం అవుతుందనుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యక్తికి తక్కువలో తక్కువ అవుతున్న అదనపు అప్పు రూ .లక్ష అంటే గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో తలసరి అప్పు రూ.5 లక్షలు ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తి మోస్తున్నాడని వివరించారు. అంటే రాష్ట్రం మొత్తం అప్పులు రూ.13 లక్షల కోట్లు అంటే తలసరి అప్పు భారం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన విధానాల వల్ల మరో రూ.5 లక్షలు కలిపి అంటే ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా కలిపి ప్రతి వ్యక్తి నెత్తి మీద రూ.7 లక్షలు అప్పు ఉందన్నారు. ప్రజలకు ఒక బిస్కట్‌ ఇస్తూ తన ఇంటికి టన్నుల టన్నుల బంగారు బిస్కట్లు దోచుకుపోవటం అన్న విధంగా జగన్‌ పాలన ఉందన్నారు. జగన్‌ పాలనలో ఆయన కుటుంబం క్షేమం-ప్రజల బతుకులకు క్షామం అన్న రీతిలో ఉందని విమర్శించారు. జగన్‌ను ఇంటికి పంపించకుంటే ప్రజల బతుకులు, భవిష్యత్తు ఢమాల్‌ అని ఎద్దేవా చేశారు.