సీఎం జగన్‌ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవాలి

పోటీ చేయకుండా నిషేధం విధించాలి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
శావల్యాపురం మండలంలో లావు, మక్కెనతో విస్తృత ప్రచారం

వినుకొండ, మహానాడు : తన పదవి స్థాయి కూడా మరిచి విపక్షాలపై బరితెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవద్దని ఎంసీసీలో నిషేధం ఉన్నా జగన్‌ తరచూ దిగజారి మాట్లాడుతూ రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బుధవారం శావల్యాపురం మండలం శానం పూడి, శావల్యాపురంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్‌, రాష్ట్ర జనసేన పార్టీ నాయకుడు శంకర శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన నాయకు లు, కార్యకర్తలు పెద్దఎత్తున వారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. శావల్యాపురం, శానంపూడికి చెందిన పలువురు వైసీపీ నేతలు ఈ సందర్భంగా తెలుగుదేశంలో చేరారు. శావల్యాపురంలో మద్దినేని అనిల్‌, శానంపూడిలో రేషన్‌ డీలర్‌ వంకాయలపాటి సూర్యచంద్రరావులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ జగన్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవసరమైతే ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రస్థాయిలో జగన్‌, వినుకొండలో బొల్లా ఐదేళ్లుగా నడిపిస్తోన్న మద్యం మాఫియాను అంతం చేసే సమయం కూడా ఆసన్నమైందని తెలిపారు. తొడలు కొట్టిన ఎమ్మెల్యే బొల్లాను కనీసం 40 వేల మెజార్టీతో ఓడిరచి తీరతామని, అది జరిగిన తర్వాత బొల్లాకు నిజంగా పౌరుషం ఉంటే అమ్మవారి గుడి వద్దకు వచ్చి మీసాలు తీయించుకోవాలని సవాల్‌ చేశారు.

వినుకొండ సమస్యలు పరిష్కరిస్తాం

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీ తాను కలసి వినుకొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి కుళాయి నీరందించి తీరతామన్నారు. ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఈ పథకాలు ఎంతో ఆసరాగా ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాదిగ సోదరుల కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. మైనింగ్‌శాఖ గనుల్లో రిజర్వేషన్లు, యంత్ర పరికరాలపై రాయితీ కోరుతున్న వడ్డెర సోదరులకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని తెలిపారు. 50 సంవత్సరాలకే బీసీలకు పింఛన్‌ ఇవ్వబోతున్నామని తెలిపారు. దాంతో పాటుగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యేగా జీవీని, ఎంపీగా తనను ఆశీర్వదిస్తే అభిమానం, గౌరవంతోనే పనులు చేయించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో బూతులు మాట్లాడే పిల్లలను తల్లిదండ్రులు దండిస్తారని.. మరి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రెస్‌మీట్‌లో బూతులు మాట్లాడితే మనమంతా ఏం చేయాలని ఎమ్మెల్యే బొల్లాను ఉద్దేశించి చురకలు వేశారు.

బూతుల ఎమ్మెల్యేను సాగనంపాలి

మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎంపీగా లావు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారన్నారు. వినుకొండలో రైల్వే అండర్‌పాస్‌, వరికపూడిశెల ప్రాజెక్టుకు అనుమతులు, గుండ్లకమ్మ నదిపై రెండు వంతెనలు తీసుకొచ్చారన్నారు. అలానే శివశక్తి ఫౌండేషన్‌ ద్వారా 20 ఏళ్ల నుంచి జీవీ ఆంజనేయులు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. వారిద్దరికీ పూర్తి విరుద్ధమైన రీతిలో పైకి పెద్దమనిషిగా చెలామణి అవుతూ లోపల కబ్జాల పర్వం నడిపించడం బొల్లాకే చెల్లిందని అన్నారు. అతడి మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బూతుల ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజన్న రాజ్యం వద్దు..శ్రీరామరాజ్యం కావాలి

జనసేన నాయకుడు నిశ్చంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, శ్రీరామరాజ్యం కావాలని అన్నారు. మంచి వ్యక్తులు, ఉన్నత విద్యావంతులైన జీవీని, లావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ను ఇష్టారీతిన తిడుతున్న జగన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో జనసైనికులంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీవీ ఆంజనేయులును, ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శావల్యాపురం మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.