-ఫామ్ 12 ఇవ్వకుండా నిబంధనల ఉల్లంఘన
-తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి
-ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ
అమరావతి, మహానాడు: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు.
పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికీ ఎటువంటి అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయంలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని, పూర్తి చేసిన వాటిని స్వీకరించాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొందని ఆ లేఖలో వివరించారు. పోలీసు అధికారులు, దరఖాస్తు చేసుకునే ఈడీసీ/పీబీ దరఖాస్తులకు నోడల్ అధికారి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తులకు సంబంధిత ఆర్వోలకు పంపేందుకు కూడా నోడల్ అధికారులు సహకరించాల్సి ఉందన్నారు.
అయితే ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ఆర్వోలు ఫామ్ -12 ఫారాలు విడుదల చేయటం లేదని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. నేటికీ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చాలాచోట్ల తగిన ఏర్పాట్లు చేయలేదని, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుస రించి పోస్టల్ బ్యాలెట్ ఫారాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.