రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…జగన్‌ ప్రభుత్వ హత్యలే

అన్నదాతలు బతికి బట్టకట్టాలంటే వైసీపీని సాగనంపాలి
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
వైసీపీ నుంచి పార్టీలోకి భారీగా వలసలు

చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం హత్యలేనని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా చిలకలూ రిపేట తెలుగుదేశం పార్టీలోకి చేరికల జాతర కొనసాగింది. చిలకలూరిపేటకు చెందిన 80 కుటుం బాలతో పాటు గంగన్నపాలేనికి చెందిన 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.

స్థానిక బాలాజీ థియేటర్‌ సమీపంలోని ఆర్కే వెల్డింగ్‌ దుకాణం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆర్కే వెల్డింగ్‌ అధినేత షేక్‌ కరీముల్లాతో పాటు వారంతా పార్టీలో చేరారు. 15వ వార్డు కౌన్సిలర్‌, సీనియర్‌ నాయకుడు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో గంగన్నపాలేనికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. చాగంటి సాంబశివరావు, గింజపల్లి వీరవసంతరావు, కోమటినేని నాగమల్లేశ్వరరావు, మద్దుకూరి నాగమల్లేశ్వరరావు, మద్దుకూరి మణికంఠ, సామినేని వెంకటేశ్వర్లు, దాసరి సుబ్బారావు, మద్దుకూరి సాంబయ్యతో పాటు 50 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైకాపా పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయన్నారు. ప్రతి రైతు కుటుంబం నెత్తిన రూ.2.45 లక్షల పైగా అప్పులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయసగటు కంటే ఆంధ్రప్రదేశ్‌ రైతులపై 2 రెట్లుకు పైగా రుణభారం ఉందని తెలిపారు. తుఫాన్లు, వరదలు, కరవు వంటి విపత్తుల సమయంలో కూడా కొద్దిమందికే పరిహారం అందించారని, పంటనష్టం పరిహారాల్ని కూడా కొందరు వైకాపా నేతల రైతుల ముసుగులో దోచుకున్నారని వాపోయారు. ఆ పరిస్థితుల్లోనే సాగు భారమై అప్పులు తీర్చే మార్గం లేకనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.