పాలమూరుకు పట్టిన దరిద్రం కాంగ్రెస్‌

నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌
సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
గ్యారంటీలు అమలు చేయకుంటే బండకేసి కొడతారు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌, మహానాడు : అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రేవంత్‌ కండ్లు నెత్తికెక్కాయ్‌ అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుక మందమెక్కి కన్నుమిన్ను కానరాక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నడు..పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్‌ పార్టీ అని మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసింది…14 లక్షల మంది వలసలకు కారణ మైంది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి జూరాల, కేఎల్‌ఐ కింద 13 వేల ఎకరాలు మినహా ఉమ్మడి పాలమూరులో ఎక్కడా సాగునీళ్లు ఇచ్చింది లేదన్నారు. 2006లో జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు పూర్తయితే 2014 వరకు వాటిని గాలికి వదిలేసింది కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. 2014లో కేసీఆర్‌ వచ్చాక రెండేళ్లలో పాలమూరు జిల్లాలోని అన్ని పెండిరగ్‌ ప్రాజెక్టుల ను పూర్తి చేసి సాగునీళ్లు అందించారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే జనం కాంగ్రెస్‌ను బండకేసి కొడతారు .. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కూడా కాంగ్రెస్‌ నాయకుల కు తీరికలేదా అని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీకి ఇచ్చిన వినతి పత్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా అంశం పేర్కొనని రేవంత్‌ పాలమూరు ఎత్తిపోత ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.