సుస్థిరమైన పాలనకు మోదీ గ్యారంటీ

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో
సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గత 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నాం. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళుతున్నామని వివరిం చారు. మూడు దశాబ్దాల తర్వాత దేశానికి ఓ సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని…ఇది మోదీ గ్యారంటీ అని తెలిపారు. ఉగ్రవాద దాడులు తగ్గిపో యాయి… నక్సలైట్ల భరతం పడుతున్నాం. అవినీతి పరులు జైళ్లలోకి పోయారు.. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం.. రేపు మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం..దేశంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో భారత్‌ను మళ్లీ విశ్వగురువును చేయడం మోదీ లక్ష్యమని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు.

న్యాయ పత్రం కాదు…అన్యాయ పత్రం

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రెండు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలు పరిశీలించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ న్యాయపత్రం పేరుతో జారీ చేసిన మేనిఫెస్టో పూర్తిగా రాహుల్‌గాంధీ అన్యాయ పత్రంగానే ప్రజలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా ప్రజలు విశ్వసిస్తున్నా రన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ విభజిత భారత్‌గా మార్చాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ముస్లింలీగ్‌ మేనిఫెస్టో మాదిరిగానే ఉందన్నారు. రాష్ట్రంలో హామీల పేరుతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌ను నమ్మొద్దని పిలుపునిచ్చారు.