రైతులకు మాజీ మంత్రి హరీష్‌రావు భరోసా
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
అధికారుల దృష్టికి ఫోన్‌లో సమస్య
తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి
సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట నియోజకవర్గం పెద్దకోడూరు గ్రామ పరిధిలోని మెట్టుబండల దగ్గర కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతుల తో మాట్లాడుతూ అధైర్య పడొద్దు…తొందరపడి తక్కువ ధరకు అమ్మకండని సూచించారు. రూ.2203 మద్దతు ధర ఇప్పిస్తా..అధికారులతో మాట్లాడి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వారి ముందే అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, డీఎం, సివిల్ సప్లయీస్, ఐకేపీ అధికారులతో మాట్లాడారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరారు. 15 రోజు ల నుంచి ధాన్యంతో ఇక్కడే ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంతో ధాన్యం తడిచిందని, ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. మోటార్లు కాలిపో తున్నాయి. రైతుబంధు పడడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లుందా అని హరీష్‌రావు రైతులను అడిగారు. దీనికి రగునవ్వ అనే రైతు మాట్లాడుతూ 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. ధాన్యం కొనే నాథుడే లేడన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉందన్నారు. నారాయణ అనే రైతు మాట్లాడుతూ నా రెండు మోటార్లు కాలిపోయాయ్ సార్…కేసీఆర్ ఉన్నపుడు 24 గంటల కరెంట్ ఉంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియడం లేదని సమాధాన మిచ్చారు. మోహన్ రెడ్డి, స్వామి అనే రైతులు మాట్లాడుతూ ఒక వైపు కరెంట్ తిప్పలు..అటు రైతు బంధు లేదు… ఏదీ లేదు. కేసీఆర్ పెద్ద మనిషి ఉన్నప్పుడే అన్నీ ఉండే సార్…ఆ సారే మరలా రావాలి అని తెలిపారు. దీంతో స్పందించిన హరీష్‌రావు రైతు రుణమాఫీ రూ.2 లక్షలు ఇవ్వలేదు. రైతుబంధు ఇవ్వలేదు. బోనస్ రూ.500 ఎగ్గొటిండు అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను వారికి వివరించారు.