అమరావతి ఉద్యమకారులకు అన్యాయం

టికెట్లు ఇవ్వకపోవటం టీడీపీ తప్పిదమే
బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
తగిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి

అమరావతి, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాజధాని అమరావతి ఉద్యమకారులను గుర్తించక పోవడం, దళితోద్యమాలను గుర్తించకపోవడం టీడీపీ తప్పిదమేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. 175 అన్నం ముద్దల్లో ఒక్క ముద్ద కూడా 1600 రోజుల అమరావతి జెండాకు పెట్టకపోవటం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు.

ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్షాల విజయం అసాధ్య మని చెప్పిన ఆయన వైకాపా పాలనలో దగాపడ్డ తొలి బాధితులు దళితులేనని గుర్తుచేశారు. దళితుల నామస్మరణ లేకుండా ఎన్నికలు లేవని కానీ, అసెంబ్లీలో దళిత ఉద్యమ నాయకులకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపుల ప్రక్రియలో మార్పులు – చేర్పులు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో అమరావతి గళం వినిపించేలా చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.