ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు ఎం.దారు నాయక్‌

నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు ఎం.దారునాయక్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యమని, పల్నాడు జిల్లా ప్రజలు ఏడు నియోజకవర్గాలు వైసీపీకి పట్టం కట్టడం తో దానికి ప్రతీకార చర్యగా భూ కబ్జాలు, భౌతిక దాడులు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు వంటివి రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని, పోలవరం, వెలుగొండ వంటి ప్రాజెక్టుల నిర్మాణం ఊసే లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సోదరుల సంక్షేమ పథకాలు రద్దు చేసిన నమ్మక ద్రోహి జగన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేసి దళిత ద్రోహిగా నిలిచిపోయారని విమర్శించారు.