గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ

మలేసియాలో ఘోర ప్రమాదం

మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శిక్షణ విన్యాసాల కోసం గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది.

ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభిస్తామని మలేసియా నౌకదళం పేర్కొంది.

‘AW139 మారిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. దీనిని ఇటాలియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ లియోనార్డో అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్ ల్యాండ్ తయారు చేసింది. మరోకటి యూరోపియన్ మల్టినేషన్ డిఫెన్స్ ఎయిర్ బస్ తయారు చేసిన ఫెన్నెక్ తేలికపాటి విమానంలో మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. రెండు హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది మొత్తం మరణించారు. సిబ్బందిని గుర్తించేందుకు వారి అవశేషాలను ఆస్పత్రికి తరలించాం’ అని నౌకదళం తెలిపింది.