సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలో సినీనటుడు సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ప్రచారం, అండమాన్ నికోబార్‌లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా మోదీ ప్రభంజనం కనిపిస్తోంది. కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం ఈ రెప్ప పాటు కాలమే జీవితం. ఈ జీవితంలో దేశం మనకేం చేసిందనే దానికన్నా ఈ దేశానికి మనమేం చేసామన్నదే ముఖ్యం. మనం భారతీయులం. మతం లేదు..గితం లేదు మనుషులంతా ఒక్కటే రా.. ఈశ్వర్ అల్లా వేరు కాదు దేవుడంటే ఒక్కటే రా అంటూ తన ప్రసంగంతో ఉత్సాహపరిచారు.
ప్రతిఒక్కరం భారతీయులమనే గర్వంతో ప్రపంచం ముందు భారతదేశం విశ్వగురువుగా నిలబడిరదంటే దానికి కారణం ప్రధాని మోదీ అని ప్రశంసించారు. నా మాతృభాష తెలుగు.. పోలీస్ స్టోరీ నన్ను హీరో చేసింది.. దానికి కారణం కర్ణాటక. మా అమ్మది బాగేపల్లి, నాన్నది వైజాగ్. నేను పుట్టింది మద్రాస్. తెలుగు, కన్నడ తమిళ్ మాట్లాడే నేను 2004 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది. మరోసారి మోదీ సర్కార్‌ను తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. గొప్ప వ్యక్తిత్వం, మానవత్వం ఉన్న మంచి మనిషి కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నాది నాది అంటే కిరాయితనం..మాది మాది అంటే పరాయితనం.. మనది మనది అంటే మగతనం, మంచితనం మన హైదరాబాద్..మన సికింద్రాబాద్..మన భారతదేశం.. మన తెలంగాణ అన్న భావనతో పనిచేయాలని కోరారు.