నీకు పరువు కూడా ఉందా ధనుంజయ్‌ రెడ్డి…

బెదిరించాలన్న ప్రయత్నం మానుకో…
ఈసీకి ఫిర్యాదు చేస్తే దావా వేస్తావా
వైసీపీ మేనిఫెస్టోతో నీకేం పని
టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు : సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. తనను బెదిరించా లన్న ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు ఇక స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడగించాలని శనివారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముకేష్‌కుమార్‌ మీనాను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేఖ రుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ అన్నాడని ఓ ప్రముఖ పత్రికలో వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోండని ఈసీని కోరితే నా మీద పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అసలు ధనుంజయ్‌ రెడ్డికి పరువు ఎంతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో ధనుంజయ్‌రెడ్డి ఉన్నారో లేరో చూడండి..ఉంటే ఎందుకు ఉన్నా రో దర్యాప్తు చేయండని తాను ఈసీని కోరితే నన్ను బెదిరిస్తున్నారు. నన్ను బెదిరించే ధైర్యం నువ్వు చేయలేవు ధనుంజయ్‌ రెడ్డి అంటూ ఫైర్‌ అయ్యారు. దొంగతనంగా దొడ్డిదారుల్లో అధికారం నిలబెట్టుకోవాలని చూడొ ద్దు. ప్రజాక్షేత్రంలో పోరాడుదాం రా అంటే దొడ్డిదారుల్లో జగన్‌ రెడ్డి వెళుతున్నారన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పొడిగించాలి
పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు ఇక స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6 వరకు పొడగించాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్‌లో ఎన్నికల అధికారులు చేసిన తప్పుకు 50 ఓట్లు ఇన్‌ వాలిడ్‌ కాకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో ఇంకా గందరగోళ పరిస్థితులున్నాయని, సీఈవో ఇస్తున్న ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు అర్థం కావడం లేదన్నారు. కలెక్టర్లు.. రిటర్నింగ్‌ అధికారులకు, ఆర్వోలు…పీవోలకు, పీవోలు..అసిస్టెంట్‌ పీవోలకు ఏమి డైరెక్షన్‌లు ఇస్తున్నారో ఎవరికి అర్థంకావడం లేదన్నారు. ఫారం-12 ఎనరోల్‌మెంట్‌ ఏప్రిల్‌ 30 తేదీతో ఆపేశామంటున్నారు. కానీ 1వ తేదీ తర్వాత కూడా ఎన్నికల విధులకు ఉద్యోగులను తీసుకువెళుతున్నారు. వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలి కదా…అందుకే ఈ ప్రక్రియను ఈ నెల 6 వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

వారి తప్పిదానికి ఓటర్లు ఎందుకు బలవ్వాలి?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గజిటెడ్‌ స్టాంప్‌ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిపారు. 50 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకున్నారు. గజిటెడ్‌ స్టాంప్‌ ఉండాలని ఉద్యోగులకు ఆర్వో చెప్పలేదు. ఓట్లు లెక్కింపు సమయంలో స్టాంప్‌ లేదని ఈ 50 ఓట్లు ఇన్‌ వాలిడ్‌ అంటారు. అలా జరగడానికి వీలులేదు. స్టాంప్‌ ఉందా లేదా అని చెక్‌ చేయకపోవడం ఎన్నికల కమిషన్‌, అధికారుల తప్పిదం. ఈ తప్పిదానికి ఓటర్లు ఎందుకు బలవ్వాలి. పోస్టల్‌ బ్యాలెట్‌పై అధికారిక వెబ్‌సైట్‌లో ఒక్క కలెక్టర్‌ కూడా వివరాలు పెట్టడం లేదు. ఇలా అధికారులు వ్యవహరిస్తుంటే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని మేము ఎలా నమ్ముతాం. ఎన్నికల కురుక్షేత్రంలో రాక్షస మనస్తత్వ మున్న రాక్షస రాజును మేము ఎదుర్కొంటున్నాం.

ఆయన కనుసన్నల్లో కొందరు అధికారులు పని చేస్తున్నారు. వృత్తి ధర్మాలను మరిచి కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పనిచేస్తున్నారు. వారిని ఎదుర్కోవాలంటే ఒక్క ఓటు కూడా వృధా కాకూడదు. ఇప్పటివరకు సుమారు 600 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు మేమిచ్చాం. ఇప్పటివరకు వాటిపై ఏమి చర్యలు తీసుకున్నారో మాకు తెలపాలి. లేకపోతే మా ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకున్నారో లేదో మాకు ఎలా తెలుస్తుంది. ఎవరికో రాజకీయ లబ్దీ చేకూర్చడం కోసం అధికార గణం పని చేయకూడదు. ప్రజల కోసం పారదర్శకతతో ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌, తెలుగుయువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.