బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు

ముస్లిం మహిళా ఓటర్ల తనిఖీపై ఈసీ ఆగ్రహం
ఇది సమస్య కాదు…భయం ఎందుకు?
అభ్యర్థులకు ఐడీ వెరిఫికేషన్‌ హక్కు ఉందని వివరణ

తప్పేమి కాదని వివరణ

హైదరాబాద్‌: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలత తన నియోజకవర్గం అజాంపూర్‌ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 122లో ఓటింగ్‌ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్‌ ఐడీలను తనిఖీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో కేసు నమోదైంది. తనపై వచ్చిన విమర్శలపై ఆమె స్పందించారు. ఐడెంటిటీ వెరిఫికేషన్‌ కోసం బురఖాలు తొలగించాలని మహిళలను కోరానని, అందులో తప్పేమీలేదని మాధవిలత వివరణ ఇచ్చారు. నేను అభ్యర్థిని…చట్టం ప్రకారం ఫేస్‌ మాస్కులు లేకుండా ఐడీ కార్డుల వెరిఫికేషన్‌ చేసే హక్కు అభ్యర్థులకు ఉంటుంది. నేనూ మహిళనే..గౌరవం ఉంది. ఐడీ కార్డుల వెరిఫికేషన్‌కు వారిని అభ్యర్థించాను. ఎవరైనా దీనిని ఒక సమస్యగా చూస్తే వారు భయపడుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుం దని తెలిపారు. దీనికి ముందు తన నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో తేడాలు ఉన్నట్టు మాధవిలత ఆరోపించారు. పోలీసు సిబ్బంది చురుకుగా లేరని చెప్పారు. ఎవరినీ తనిఖీలు చేయడం లేదన్నారు. ఇక్కడకు వచ్చిన సీనియర్‌ సిటిజన్ల పేర్లు ఓటరు లిస్టులో లేవని చెప్పారు. వీరిలో కొందరు గోషామహల్‌లో ఉంటున్నారని, కానీ వాళ్ల పేర్లు రంగారెడ్డి లిస్ట్‌లో ఉన్నాయని చెప్పారు.