మరో వివాదంలో కేజ్రీవాల్‌ పీఏ

కాల్‌ చేసి పిలిపించి దాడికి పాల్పడ్డారు
మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. సీఎం నివాసం నుంచి రెండుసార్లు పీసీఆర్‌ కాల్‌ చేసి సీఎం పీఏ బిభవ్‌కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీసీపీ మనోజ్‌ మీనా స్పందించారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉదయం 9.34 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో పోలీసు లు సివిల్‌ లైన్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ ఆమె అక్కడ కన్పించలేదని, కొద్దిసేపటికి స్టేషన్‌కు వచ్చిన స్వాతి తర్వాత ఫిర్యాదు చేస్తానంటూ వెళ్లిపోయిన ట్లు వివరణ ఇచ్చారు.

ఎవరీ బిభవ్‌కుమార్‌?

బిభవ్‌కుమార్‌ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచారు. ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆయన నియామకం చట్టవిరుద్ధమని విజిలెన్స్‌ విభాగం తొలగించింది. మరోవైపు ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు, ఢిల్లీ జల్‌ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారనే కేసుల్లో ఆయన ఈడీ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరిలో బిభవ్‌కుమార్‌, ఆప్‌ ఎమ్మెల్యే ఎన్డీ గుప్తాకు సంబంధిం చిన 12 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. గత నెలలో ఎక్సైజ్‌ పాలసీ కేసుకు సం బంధించి బిభవ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. కొన్ని పత్రాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టు సమయంలో స్వాతి మలివాల్‌ మౌనం వహించారు. ఆ సమయంలో ఆమె భారత్‌లో లేరు. కేజ్రీవాల్‌ జైలులో ఉన్నంకాలం ఎలాంటి ప్రకటనలు కూడా చేయకపోవడం గమనార్హం.